PM Modi On Diwali: జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకోవడం తనకు మరింత ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం కార్గిల్ ప్రాంతంలో సైనికులతో కలిసి మోదీ దీపావళిని జరుపుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కార్గిల్‌లో సైనికులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
ఎన్నో ఏళ్లుగా మీరే నా కుటుంబం. నా ఆనందం మీ మధ్యలోనే ఉంది. మీ అందరి మధ్య దీపావళి జరుపుకోవడం ఒక విశేషం. దీపావళి అంటే చెడును ముగించే పండుగ. కార్గిల్ దానిని సాధ్యం చేసింది. సరిహద్దు సురక్షితంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, సమాజం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు దేశం సురక్షితంగా ఉంటుంది. - ప్రధాని నరేంద్ర మోదీ
భారత్ శక్తి
బయటా, లోపలా శత్రువులతో విజయవంతంగా వ్యవహరిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మన జాతీయ జెండా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు రక్షణ కవచంగా మారింది. భారత గౌరవం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. బయటా, లోపలా శత్రువులకు వ్యతిరేకంగా భారత్ విజయవంతంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. మీరందరూ సరిహద్దుల్లో మమ్మల్ని రక్షించినట్లే, మేము దేశంలో ఉగ్రవాదం, 'నక్సల్ వాదం', అవినీతి వంటి శత్రువులపై పోరాడుతున్నాం. మన దేశ శక్తి పెరిగినప్పుడు, అది ప్రపంచ శాంతి, శ్రేయస్సును కూడా పెంచుతుంది. - ప్రధాని నరేంద్ర మోదీ
యుద్ధం కోరుకోం
భారత్ ఎన్నడూ యుద్ధం కోరుకోదని కానీ తమ జోలికి వస్తే మాత్రం వదిలి పెట్టమని సరిహద్దు దేశాలకు ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరికలు చేశారు.
మేము యుద్ధాన్ని మొదటి ఎంపికగా ఎప్పుడూ చూడలేదు. అది లంకా యుద్ధం కావచ్చు లేదా కురుక్షేత్ర యుద్ధం కావచ్చు.. మేము దానిని వాయిదా వేయడానికి చివరి వరకు ప్రయత్నించాం. మేము యుద్ధానికి వ్యతిరేకం కానీ బలం లేకుండా శాంతి ఉండదు. ఎవరైనా మనల్ని చెడు దృష్టితో చూసే ధైర్యం చేస్తే, మన సాయుధ దళాలు తగిన సమాధానం ఇస్తాయి. - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: UK Next PM: రిషికి కలిసొచ్చిన దీపావళి- ప్రధాని రేసు నుంచి బోరిస్ జాన్సన్ ఔట్!