PM Modi: 


పాతికేళ్ల బంధం..


ఇటీవలే అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ...ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌కి వెళ్లారు. ఓర్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్కడే జులై 14న జరగనున్న Bastille Day వేడుకల్లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో చర్చించనున్నారు. అక్కడ ఇండియన్ కమ్యూనిటికీ చెందిన పౌరులతో పాటు పలు కంపెనీల సీఈవోలతోనూ మాట్లాడనున్నారు. ఫ్రాన్స్‌కి బయల్దేరే ముందు ప్రధాని మోదీ కీలక విషయాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరపనున్నట్టు స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ ఫ్రాన్స్‌కి వెళ్లారు. 


"భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో పాతికేళ్లు. రెండు దేశాల మధ్య మైత్రి కుదిరింది. పలు విషయాల్లో ఇరు దేశాలూ కట్టుబడి ఉంటున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్‌ రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడుల, విద్యా రంగాల్లోనూ భాగస్వామ్యం కుదిరింది. స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అంతర్జాతీయ సవాళ్లు అధిగమించేందుకు ఇరు దేశాలూ కలిసి కృషి చేస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ని కలిసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వచ్చే పాతికేళ్లలో ఇరు దేశాల మధ్య బంధం ఎలా ఉండాలో నిర్ణయించనున్నాం"


- ప్రధాని మోదీ