PM Modi On Opposition: 


అన్నీ స్కామ్‌లే: కాంగ్రెస్ 


ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య  పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆయన పదేళ్ల యూపీఏ పాలనపై విరుచుకు పడ్డారు. ఆ దశాబ్ద కాలంలో అన్నీ స్కామ్‌లే జరిగాయని విమర్శించారు. 


"2004-14 మధ్య యూపీఏ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. హింస చెలరేగింది. యూపీఏ అసమర్థత కారణంగా ప్రతి అవకాశమూ సంక్షోభానికే దారి తీసింది. మోదీని తిట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే...140 కోట్ల మంది ప్రజలు నన్ను కవచంలా రక్షిస్తున్నారు" 


- ప్రధాని నరేంద్ర మోదీ 


దేశంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోందని ఎద్దేవా చేశారు. అంతే కాదు. యూపీఏ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్యవ్యస్తంగా ఉందని అన్నారు. 


"2014కి ముందు 2004-14 వరకూ ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆ పదేళ్లలోనే ఎక్కువగా అవినీతి జరిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం ఉగ్రవాదంతో వణికిపోయింది. హింస తప్ప అక్కడి ప్రజలు ఏ అభివృద్ధీ చూడలేకపోయారు. ఆ పదేళ్లలో అంతర్జాతీయంగా భారత్‌ చాలా బలహీనపడిపోయింది" 


- ప్రధాని నరేంద్ర మోదీ 










కాంగ్రెస్‌పై సెటైర్లు..


ఆ పదేళ్లలో చేసిన అవినీతి కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు ఈడీ దాడులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సెటైర్‌లు కూడా వేశారు. ఓటర్లు చేయలేని పని ఈడీ చేయగలిగిందని...ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేలా చేసిందని అన్నారు. విమర్శలకూ ఓ విధానం ఉంటుందని, అలా కాకుండా వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు చేశారు మోదీ. హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియాకు వచ్చే విషయంపైనా మాట్లాడారు. 


"భారత్ ఆర్థిక వ్యవస్థ ఎలా దిగజారిపోతోందన్న విషయమే హార్వర్డ్ యూనివర్సిటీకీ ఓ కేస్‌ స్టడీ అవుతుందని కాంగ్రెస్ చెబుతోంది. కొన్నేళ్లుగా ఆ యూనివర్సిటీ ఓ స్టడీ చేసింది. రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ కాంగ్రెస్ అనే టాపిక్‌పై అధ్యయనం చేసింది. భవిష్యత్‌లో హార్వర్డ్‌ యూనివర్సిటీతో పాటు ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ కాంగ్రెస్ పతనం గురించి చెప్పుకుంటారు" 


- ప్రధాని నరేంద్ర మోదీ 


అటు ప్రతిపక్షాలు మాత్రం అదానీ అంశంపై ప్రధాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి. అదాని..ప్రధాని ఫ్రెండ్ కాకపోయింటే ఇంత వరకూ విచారణ ఎందుకు జరిపించడం లేదని అడుగుతున్నాయి. ఈ విచారణకు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని ప్రసంగాన్ని
అడ్డుకునే ప్రయత్నం చేశారు. 


Also Read: PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?