PM Modi Suuba Diving in Dwaraka: ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో పర్యటించారు. అంతకు ముందు భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతుని ప్రారంభించారు. ఆ తరవాత ద్వారకాధీష్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ సమయంలోనే సముద్రంలో కాసేపు సేద తీరారు. నీళ్లలో మునిగి తన్మయత్వం పొందారు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతుంటారు. అందుకే ఆ అరేబియా సముద్రంలో మునిగి పూజలు చేశారు ప్రధాని మోదీ. Beyt Dwarka ద్వీపం వద్ద స్కూబా డైవింగ్ చేశారు. ఇక్కడే ద్వారకా నగరపు ఆనవాళ్లు ఉన్నాయి. సరిగ్గా ఈ చోటే ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేశారు. ఆ తరవాత X వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు. అద్వితీయమైన భక్తిభావంలో మునిగిపోయానంటూ పోస్ట్ పెట్టారు. ఆ శ్రీకృష్ణుడు అందరికీ ఆశీర్వాదం అందించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డైవింగ్ చేసే సమయంలో ప్రధాని మోదీ చేతిలో నెమలి పింఛంతో కనిపించారు. శ్రీకృష్ణుడు తలపై నెమలి పింఛాన్ని ధరిస్తాడు. 






గుజరాత్‌లోని ద్వారకాలో భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ Sudarshan Setu ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఓఖా, బెయిత్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ వంతెనని నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.979 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకాని ఇది అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు లేన్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్‌పాత్ కోసం 2.50 మీటర్ల వెడల్పుని కేటాయించారు. ఈ ఫుట్‌పాత్‌నీ చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. గోడలపై భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు. ముందు దీన్ని Signature Bridge గా చెప్పిన ప్రభుత్వం ఆ తరవాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది. రూ.48 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇందులో రూ.35,700 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు గుజరాత్‌కి చెందినవే. ఇందులో NHAI,రైల్వేస్, రోడ్ అండ్ బిల్డింగ్స్..ఇలా రకరకాల ప్రాజెక్ట్‌లున్నాయి.