PM Modi Speech in Rajya Sabha: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మూడోసారి NDAకి పట్టంకట్టారని అన్నారు. కొందరు ప్రజా తీర్పుని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి పనులే ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని తేల్చి చెప్పారు. రాజ్యాంగం తమకు చాలా పవిత్రమైందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచిందని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ప్రజలు ఓడించినా ఇంకా ఆ పార్టీలో మార్పు రాలేదని మండి పడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వం ఎంతో చేసిందని వెల్లడించారు. అయితే..ఇదంతా శాంపిల్ మాత్రమేనని, భవిష్యత్‌లో అసలు అభివృద్ధి చూస్తారని స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తుండగానే విపక్ష నేతలు నినదించారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆ తరవాత సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపైనా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని ఎద్దేవా చేశారు. 


"నిజాలు వినే సత్తా లేని వాళ్లను, అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసే వాళ్లను దేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని వాళ్లకు సభలో సమాధానాలు వినే ధైర్యమూ ఉండదు. వాకౌట్‌ చేసి ఈ సభను తీవ్రంగా అవమానించారు. సభా సంస్కృతికే మచ్చతెచ్చారు"


- ప్రధాని మోదీ 






కాంగ్రెస్ మాజీ చీఫ్‌ సోనియా గాంధీని రిమోట్ అని మోదీ సెటైర్లు వేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఆటో పైలట్, రిమోట్ పైలట్‌ మోడ్‌లో నడిచిందని విమర్శించారు ప్రధాని. అయితే..సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ ఖండించింది. మోదీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభ ఛైర్మన్‌ని కోరారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. దీనికి నిరసనగా వెంటనే నినాదాలు చేసి సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. 


మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఆ చర్యలే ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. మహిళల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టామని వివరించారు. బెంగాల్‌లో ఓ మహిళపై రోడ్డుపైనే దాడి జరిగిన ఘటనను సభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఆ ఘటనపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీనియర్ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. 


Also Read: Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?