PM Modi Speech:
సెక్యులరిజం అంటే ఇది: ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అదానీ అంశంపై మాట్లాడాలంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా వాటిని ఖాతరు చేయకుండా మోదీ తనదైన స్టైల్‌లో కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. మోదీ అదాని భాయీ భాయీ అన్న కాంగ్రెస్ నినాదాల మధ్యే మోదీ తన ప్రసంగం కొనసాగించారు. ఇదే సమయంలో సెక్యులరిజం అంటే ఏంటో కొత్త నిర్వచనం ఇచ్చారు.
"ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకూ అందుతున్నాయి. ఇదే అసలైన సెక్యులరిజం. మాపై చల్లడానికి మీ దగ్గర మట్టి ఉంటే...మా దగ్గర రంగులున్నాయి. మీరెంత బురద జల్లితే అంత గొప్పగా కమలం వికసిస్తుంది. నిజమైన సెక్యులరిజం దిశగా దేశాన్ని నడిపిస్తోంది మా ప్రభుత్వం మాత్రమే"
ప్రధాని నరేంద్ర మోదీ
ఎన్నో దశాబ్దాలుగా ఈ పార్లమెంట్ వేదికగా ఎంతో మంది మేధావులు, నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని, వారి మాటల్ని ప్రజలు విని గౌరవించారని అన్నారు మోదీ. కానీ..కొందరు సమయం వృథా చేస్తూ అనవసరమైన ప్రసంగాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అత్యంత ముఖ్యమైన నీటి సమస్యనూ తమ ప్రభుత్వం పరిష్కరించిందని స్పష్టం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేసుకుని వాడుకునేలా ప్రజల్ని ప్రోత్సహించినట్టు వెల్లడించారు. బ్యాంకుల విలీనాన్నీ ప్రస్తావించారు. పేదలకూ బ్యాంకు సేవలు అందే విధంగా సంస్కరణలు చేపట్టినట్టు చెప్పారు. జన్ ధన్ ఖాతాల ద్వారా గ్రామాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు.
సెటైర్లు..
ఇదే సమయంలో గాంధీ కుటుంబంపైనా సెటైర్లు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పాలనలో దాదాపు 600 ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టారన్న ఆయన..వాటిలో ఏ ఒక్క పథకానికీ నెహ్రూ ఇంటి పేరుని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. "టోకెనిజం" విధానంలో సమస్యల్ని పరిష్కరించాలని చూశారని విమర్శించారు.
"కొందరు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృత పదాలెందుకని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో నెహ్రూ గాంధీ పేరిట మొత్తం 600 పథకాలు అమల్లోకి వచ్చాయి. నెహ్రూ నిజంగా అంత గొప్ప వ్యక్తే అయితే వాళ్లు (కాంగ్రెస్ పార్టీ) తమ పథకాల్లో నెహ్రూ ఇంటి పేరుని ఎందుకు పెట్టలేదు? ఆయన ఇంటి పేరుని ప్రస్తావించడానికి అంత బెరుకు ఎందుకు? ఇందులో సిగ్గు పడాల్సిందేముంది?"
ప్రధాని నరేంద్ర మోదీ
శుభసూచకం: మోదీ
సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు ప్రధాని మోదీ. మన శాస్త్రవేత్తల్ని కించపరిచారని మండి పడ్డారు. దేశం గురించి కాకుండా కేవలం తమ స్వార్థ రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచమంతా నివ్వెరపోయేలా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ముందంజలో ఉందని వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...ఇలా ఇద్దరు మహిళల ప్రసంగాలతో మొదలు కావటం శుభసూచకం అని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Tripura Polls: ఆపరేషన్ త్రిపురకు రెడీ అవుతున్న బీజేపీ, మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నడ్డా