​Tripura BJP Manifesto:


సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో..


త్రిపుర ఎన్నికలపై గురి పెట్టింది బీజేపీ. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గుజరాత్‌లో భారీ విజయం సాధించింది కాషాయ పార్టీ. హిమాచల్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే గుజరాత్‌ స్థాయిలోనే త్రిపురలోనూ భారీ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఈ మేరకు రూట్ మ్యాప్‌ కూడా రేడీ చేసుకుంది. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అగర్తలాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా "సంకల్ప పత్ర" పేరిట ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. "ఇది కేవలం కాగితం కాదు. ప్రజల పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం" అని తేల్చి చెప్పారు నడ్డా. ఒకప్పుడు త్రిపుర పేరు చెబితే హింసాత్మక వాతావరణమే గుర్తొచ్చేదని... ఇప్పుడు ఈ రాష్ట్రం శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. "త్రిపురలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌లు ఇచ్చాం. ఇందుకోసం రూ.107 కోట్లు ఖర్చు చేశాం" అని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులన్నింటినీ ప్రస్తావించారు. ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 3.5 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ కింద అందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించామని చెప్పారు. 2018లో కేవలం 3% ఇళ్లలో మాత్రమే తాగు నీటి సౌకర్యం ఉండేదని...బీజేపీ ఆ సంఖ్యను 55%కి పెంచిందని వెల్లడించారు. త్రిపుర ప్రజల తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు జేపీ నడ్డా. 






రూ.5కే భోజనం..


అనుకూల్ చంద్ర స్కీమ్‌లో భాగంగా రూ.5 కే అందరికీ భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అభివృద్ధి విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ సారి మేనిఫెస్టోలో మరెన్నో ఆసక్తికరమైన అంశాలు చేర్చామని, అవన్నీ అభివృద్ధికి తోడ్పడేవే అని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి చూపుతారని చెప్పిన నడ్డా...యువతను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మేనిఫెస్టో విడుదల చేసే ముందు జేపీ నడ్డా మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించుకున్నారు. త్రిపురలో 60 అసెంబ్లీ నియోజవర్గాలున్నాయి. ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు విడుదల చేస్తారు. 55 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపనున్న బీజేపీ...మరో 5 సీట్లను పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీకి కేటాయించింది. 


త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహా ప్రతిపక్షాలను ఉద్దేశించి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. వామపక్ష  పార్టీల నేతలందరూ బీజేపీలో చేరాలంటూ పిలుపునిచ్చారు. ఈ సమయంలోనే  బీజేపీని గంగానదితో పోల్చారు. సౌత్ త్రిపురలోని కక్రబన్‌లో జరిగిన ర్యాలీలో ఓ సభకు హాజరయ్యారు మాణిక్. ఆ సమయంలోనే ఈ కామంట్స్ చేశారు.


"ఇప్పటికీ స్టాలిన్, లెనిన్ భావజాలాన్ని ఇంకా నమ్ముతున్న నేతలకు ఇదే మా ఆహ్వానం. బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లాంటిది. గంగానదిలో ఓ సారి మునకేస్తే పాపాలన్నీ తొలిగినట్టు  మా పార్టీలో చేరితో మీ పాపాలు తొలగిపోతాయి" 


- త్రిపుర సీఎం మాణిక్ సహా 


Also Read: PM Modi - Pathaan Movie: పార్లమెంట్‌లోనూ పఠాన్ జోష్, హౌజ్‌ఫుల్ అంటూ ప్రధాని మోదీ కితాబు! ఫ్యాన్స్‌ హ్యాపీ