PM Modi on Pathaan Movie:
శ్రీనగర్‌లో హౌజ్‌ఫుల్
షారుఖ్ ఖాన్ మూవీ "పఠాన్" రికార్డులు క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల తరవాత బాలీవుడ్‌కు మళ్లీ జోష్ పెంచింది ఈ సినిమా. కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. కింగ్ ఖాన్ షారుక్ రేంజ్ ఏంటో మరోసారి పరిచయం చేసింది ఈ సినిమా. అయితే..ఈ సినిమాకు విడుదల ముందు పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టాయి. అసలు విడుదల అవుతుందా లేదా అన్న స్థాయిలో చర్చలూ జరిగాయి. ఓ పాట విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానైంది. కానీ...సినిమా విడుదలయ్యాక ఆ వివాదాల ప్రభావాన్ని తట్టుకుని కూడా గట్టిగా నిలబడింది పఠాన్. విదేశాల్లోనూ హౌజ్‌ఫుల్‌తో షోలు నడుస్తున్నాయి. ఈ క్రేజ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు. ఏకంగా పార్లమెంట్‌లోనే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఎన్నో దశాబ్దాల తరవాత శ్రీనగర్‌లో థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతున్నాయని అన్నారు. నేరుగా పఠాన్ పేరుని ప్రస్తావించకపోయినా...అక్కడ ఆ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తున్న క్రమంలో షారుక్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం సంబర పడిపోతున్నారు. ప్రధాని పఠాన్ గురించే చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రధాని స్పీచ్‌ని పోస్ట్ చేస్తూ "షారుక్ క్రేజ్ ఇదీ" అంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. శ్రీనగర్‌లో అన్ని థియేటర్లు హౌజ్‌ఫుల్‌గా నడుస్తున్నాయంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్న క్రమంలోనే ప్రధాని కామెంట్స్ చేయడం వైరల్ అవుతోంది. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 865 కోట్ల వసూళ్లు రాబట్టింది పఠాన్ మూవీ. ఇండియాలో ఇప్పటికే 450 కోట్లు దాటాయి వసూళ్లు.