ఆర్థిక మాంద్యం దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలే చతికిల పడుతున్నాయి. అందుకే ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుంటే మరికొన్ని ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. ఇలా పలు మార్గాల్లో తమ డబ్బును ఆదా చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి డిస్నీ కూడా చేరిపోయింది. ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా వెలుగొందుతున్న డిస్నీ 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని సీఈఓ బాబ్ ఐగర్ తీసుకున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబరులో కంపెనీ పగ్గాలను ఆయన తీసుకున్నారు.
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అంత తేలిగ్గా తీసుకోలేదని సీఈఓ బాబ్ ఐగర్ తెలిపారు. వినియోగదారులు ఖర్చులను తగ్గించడంతో గత త్రైమాసికంలో తమ స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్యలో చాలా మార్పు వచ్చిందన్నారు. భారీగా సబ్‌స్క్రైబర్స్ తగ్గిపోయారని కంపెనీ తెలిపింది. అంతకు ముందు కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరిగింది.
కంపెనీ ముందు అనేక సవాళ్లు
2022 డిసెంబర్‌లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఐగర్‌కు చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆయన వచ్చీరాగానే భూవివాదం చుట్టు ముట్టింది. ఇప్పటి వరకు డిస్నీ నియంత్రణలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకున్నారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్. అంతే కాదు నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్‌లో తన వినియోగదారుల సంఖ్యను భారీగా పెంచుకుంది. అదే టైంలో డిస్నీ+కు సబ్‌స్క్రైబర్స్ తగ్గుతూ వస్తున్నారు. ఇది కూడా ఆయన ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. ఖర్చులను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ఆఫ్షన్‌ను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
మార్గాన్ని చూపిన పెద్ద కంపెనీలు
ఆర్థిక మాంద్యం కారణంగా అనేక పెద్ద కంపెనీలు లేఆఫ్స్ ఇస్తున్నాయి. గూగుల్ దాదాపు 12 వేల మందిని విధుల నుంచి తొలగించింది. గూగుల్‌తోపాటు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), అమెజాన్, మైక్రోసాఫ్ట్, శాప్, ఓఎల్ఎక్స్, మరికొన్ని పెద్ద కంపెనీలు తమ సిబ్బందిని పెద్ద ఎత్తున తొలగించాయి.