Karnataka Elections 2023: 



కాంగ్రెస్‌పై సెటైర్లు 


కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కోలార్ జిల్లాలో భారీ బహిరంగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని అవినీతి పరుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. 2014ముందుతో పోల్చి చూస్తే భారత్ ఎంతో పురోగతి సాధించిందని, కాంగ్రెస్ హయాంలో ఇది సాధ్యం కాలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ ఓ ఔట్ డేటెడ్ ఇంజిన్ అని సెటైర్లు వేశారు. 


"కాంగ్రెస్ పార్టీ ఓ ఔట్‌ డేటెడ్ ఇంజిన్ లాంటిది. వాళ్ల వల్లే దేశంలో అభివృద్ధి జరగలేదు. ఆ పార్టీ ఇచ్చేవన్నీ అబద్ధపు హామీలే. ఇంత వరకూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ విషయంలో వాళ్లు రికార్డులు బద్దలు కొట్టారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కానీ బీజేపీ అలా కాదు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చింది. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది"


- ప్రధాని నరేంద్ర మోదీ


ర్యాలీకి వచ్చిన ప్రజల సంఖ్యను చూసి కాంగ్రెస్‌కి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు వాళ్లను ఎప్పుడో పక్కన పెట్టారని అన్నారు. 


"ర్యాలీకి ఇంత మంది ప్రజలు తరలి వస్తుంటే కాంగ్రెస్, జేడీఎస్‌కి నిద్ర పట్టడం లేదు. అభివృద్దికి ఈ రెండు పార్టీలే పెద్ద అడ్డంకులు. ప్రజలు వాళ్లను కాదని పక్కన పడేశారు. అవినీతిమయమైన ఆ రెండు పార్టీల నుంచి కర్ణాటక ప్రజలను కాపాడుకోవాలి. 2005లో కాంగ్రెస్ ఓ హామీ ఇచ్చింది. 2009లోగా దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ అందిస్తామని చెప్పింది. 2014 వరకూ వాళ్లు అధికారంలో ఉన్నా ఆ హామీ నెరవేర్చలేదు. గ్రామాలకూ విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది" 


- ప్రధాని నరేంద్ర మోదీ






సీఎం బసవరాజు బొమ్మైని 40% కమిషన్ సీఎం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ విమర్శలకూ గట్టి బదులిచ్చారు ప్రధాని. అవినీతిలో కాంగ్రెస్‌ ఎన్నో రికార్డులు సాధించిందని అన్నారు. 


"కాంగ్రెస్ 85% కమిషన్ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధానే ఈ మాట చెప్పారు. రైతులకు వెళ్లే నిధుల్లో 15% మాత్రమే వాళ్లకు అందింది. మిగతా 85% కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. బీజేపీ సంకల్పం ఒక్కటే. కర్ణాటకను దేశంలోని నంబర్ వన్‌గా మార్చాలి. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్‌ని ఎన్నుకోండి. ఔట్ డేటెడ్ ఇంజిన్‌తో కాంగ్రెస్ ఏ పనీ చేయలేదు. అస్థిర ప్రభుత్వాలకు ఓ విజన్ అంటూ ఏమీ ఉండదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు భారత్‌ విశ్వాసం కోల్పోయింది. కానీ బేజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త నమ్మకం వచ్చింది. అభివృద్ధిపై దృష్టి పెరిగింది. కాంగ్రెస్,జేడీఎస్ హయాంలో ఇది ఎక్కడా కనిపించలేదు"


- ప్రధాని నరేంద్ర మోదీ 


Also Read: మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యే వాడిని, మళ్లీ మళ్లీ రికార్డ్ చేయాల్సి వచ్చేది - మన్‌కీ బాత్‌ పై ప్రధాని