Mann Ki Baat 100th Episode:
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. దేశ ప్రజలందరకీ అభినందనలు తెలిపారు. వేలాది మంది తనకు లెటర్స్ రాశారని, లక్షలాది మంది మెసేజ్‌లు పంపారని చెప్పారు. దాదాపు అన్నింటినీ చదివేందుకు ప్రయత్నించానని అన్నారు. మన్‌కీబాత్ కేవలం ఓ కార్యక్రమం మాత్రమే కాదని ఎంతో మందిని కదిలించిన ఉద్యమం అని వెల్లడించారు.
"మన్‌కీ బాత్ నాది మాత్రమే కాదు. ఇది దేశ ప్రజలందరి మనసులోని మాట. ఇది కేవలం ఓ కార్యక్రమం కాదు. దేశ పౌరులకు నేను ఇచ్చిన కానుక. ఇన్ని రోజుల ప్రయాణాన్ని నేను ఓ ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తున్నాను. బేటీ బచావో, బేటీ పడావో, స్వచ్ఛ భారత్ అభియాన్, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్..ఇలా ఏ కార్యక్రమమైనా సరే అది మన్ కీ బాత్‌తో ముడి పడిపోయింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. సెల్ఫీ విత్ డాటర్ అనే ఇనిషియేటివ్‌కి కూడా భారీ స్పందన వచ్చింది. యాక్టివిస్ట్ సునీల్ జగ్లన్ ఆలోచన ఇది. ప్రజలందరితో కనెక్ట్ అవ్వడానికి నాకు ఇదో వేదికగా మారింది. అందుకే దేశమంతా ఈ 100వ ఎపిసోడ్‌ని పండుగలా జరుపుకుంటోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
మన్‌కీ బాత్ మొదలు పెట్టినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దీనిపై చర్చించానని చెప్పారు మోదీ. ఆ తరవాత ఈ కార్యక్రమం గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుందని వెల్లడించారు. 2014 అక్టోబర్‌లో మొదలైన ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి స్పందన రావడం ఆనందంగా ఉందని అన్నారు.
"2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలకు దీనికి మద్దతుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. చిన్న, పెద్ద..ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. ఈ ప్రయాణంలో నేను ఎన్నో సార్లు భావోద్వేగానికి లోనయ్యాను. అందుకే చాలా సార్లు మళ్లీ మళ్లీ రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఈ జర్నీ నాకెంతో ప్రత్యేకం. చాలా కీలకమైంది కూడా"
- ప్రధాని నరేంద్ర మోదీ
టూరిజం రంగం చాలా అభివృద్ధి చెందుతోందన్న మోదీ, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. టూరిజం రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతో ముఖ్యమని వెల్లడించారు. ఈ 100వ ఎపిసోడ్‌ని యూకేలోని ఇండియన్ హౌజ్‌లోనూ ప్రసారం చేశారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అక్కడే ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. ఢిల్లీలోనూ రాజ్ నివాస్‌లోనూ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. ఈ ఎపిసోడ్ విన్న తరవతా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ప్రజలందరినీ ఇలా ఒక్కటి చేయడం ప్రధాని మోదీకే సాధ్యమని కితాబునిచ్చారు. పెద్ద మనసున్న వాళ్లే ప్రజలతో మమేకమవుతారని ప్రశంసించారు.