Indian Community In Australia: 



భద్రతకు భరోసా..


ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రధాని మోదీ అడిగారు. ఇందుకు ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు. కొద్ది నెలలుగా ఆస్ట్రేలియాలోని పలు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. గోడలపై అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు. దీనిపై చాలా రోజులుగా భారతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 


"ఆస్ట్రేలియాలో కొన్ని ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రధాని ఆంథోని అల్పనీస్‌తో చర్చించాను. భారతీయుల భద్రతకు భరోసా ఇస్తామని నాకు హామీ ఇచ్చారు. ఇదే మా ప్రాధాన్యత అని కూడా చెప్పారు"


- ప్రధాని నరేంద్ర మోదీ


ఇదే సమావేశంలో ద్వైపాక్షిక బంధంపై చర్చలు జరిపారు ఇద్దరు ప్రధానులు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలోనూ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. 


"రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది చాలా కీలకం. భద్రతా పరంగానూ పరస్పరం సహకరించుకోవాలి. అందుకే ఇండో పసిఫిక్ రీజియన్‌లో రక్షణకు సంబంధించిన అంశాన్ని చర్చించాం. ఆర్థికపరమైన ఒప్పందాలు జరిగేందుకూ ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి"


- ప్రధాని నరేంద్ర మోదీ