ఆ స్కూల్‌లో ప్రధాని మోదీపై పాఠం
ప్రధాని మోదీ ధైర్య సాహసాన్ని ఓ పాఠ్యాంశంగా పెట్టారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ విద్యార్థుల బుక్‌లో ఈ లెసన్‌ని ప్రచురించారు. చిన్నతనంలో మోదీ చేసిన ఓ సాహసాన్ని ప్రస్తావిస్తూ ఈ పాఠాన్ని ప్రవేశపెట్టింది స్కూల్ యాజమాన్యం. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే బేర్ గ్రిల్స్‌తో తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పారు మోదీ.
ప్రధాని మోదీ ఎంతో ధైర్యవంతుడు అంటూ పాఠాలు
"నేను స్నానం చేసేందుకు ఓ కొలనులోకి దిగాను. అందులో నాకు ఓ మొసలి పిల్ల కనిపించింది. అది తీసుకుని ఇంటికి వెళ్లాను. మా అమ్మ చూసి, అలా చేయకూడదని వారించింది. మళ్లీ నీళ్లలో వదిలి రమ్మని చెప్పింది. వెంటనే వెళ్లి ఆ మొసలి పిల్లను నీళ్లలో వదిలేసి వచ్చాను" అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సంఘటన ఆధారంగా చేసుకునే తమిళనాడులోని ప్రైవేట్ స్కూల్ పాఠాన్ని ప్రచురించింది. మోదీ ఎంత ధైర్యవంతుడో చూడండి అంటూ అక్కడి ఉపాధ్యాయులు పిల్లలకు పాఠం చెబుతున్నారట. "నరేంద్ర దామోదరదాస్ మోదీ మన దేశపు 14వ ప్రధానమంత్రి. ఆయన ఎంతో ధైర్యవంతుడు. చిన్నప్పుడే మొసలి పిల్లను పట్టుకుని ఇంటికి వచ్చారు" అని అందులో ప్రచురించారట. టెక్స్ట్‌బుక్‌లోనే కాదు. "బాల్ నరేంద్ర-చైల్డ్‌హుడ్ స్టోరీస్ ఆఫ్ నరేంద్ర మోదీ" అనే ఓ కామిక్ బుక్‌లోనూ ప్రధాని మోదీ ధైర్యసాహసాల గురించి కథ రాశారు. బ్లూ స్నెయిల్ యానిమేషన్ సంస్థ ఇందుకు సంబంధించిన యానిమేషన్ వీడియోలనూ తయారు చేసిందట. ఈ కామిక్ బుక్‌లో మరో కథ కూడా ఉంది. ప్రధాని మోదీ 8వ తరగతి చదువుతున్న రోజుల్లో గుజరాత్‌లోని ఓ కొలనులోకి దిగారట. ఓ మొసలి ఆయనపై దాడి చేసిందట. ఈ దాడిలో మోదీ కాలికి గాయం కాగా 9 కుట్లు పడ్డాయంటూ రాసుకొచ్చారు ఆ కామిక్ బుక్‌లో.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి వందో పుట్టిన రోజు సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమ్మతో ఉన్న మధురానుభూతులన్నింటినీ కలిపి లేఖ రాశారు. " వర్షాలకు మా ఇంటి పైకప్పు కారుతూ లోపలంతా నీటితో నిండిపోయేది. నీరుకారే ప్రతి చోట బకెట్లు, పాత్రలు పెట్టడానికి మా అమ్మ చాలా అవస్థ పడేది. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ మానసిక స్థైర్యానికి ఆమె మారుపేరు అన్నట్లు ఉండేది. ఇక ఇలా ఒడిసి పట్టిన వాననీటిని ఆ తర్వాత కొద్ది రోజులు వాడుకునే తీరు తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. జల సంరక్షణకు ఇంతకన్నా మంచి ఉదాహరణ మరేముంటుంది" అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు ప్రధాని మోదీ.