Telangana Formation Day:
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 9 ఏళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా భారీ ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల నైపుణ్యాన్ని, సంస్కృతిని ప్రశంసించారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ట్వీట్‌లు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు.
"తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడి ప్రజల నైపుణ్యాలు, సంస్కృతి ఎంతో గొప్పవి. తెలంగాణ పౌరులంతా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను"
- ప్రధాని నరేంద్ర మోదీ
మోదీతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు.
"తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ రాష్ట్రం ఎన్నో సంస్కృతులకు, ప్రతిభావంతులకు నిలయం. ఇక్కడి అడవులు ప్రత్యేకమైనవి. క్రమంగా ఈ రాష్ట్రం ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుండటం చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"
- ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ మరింత వెలిగిపోవాలని ఆకాంక్షించారు.
"తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు ఈ ప్రాంతం. ఏళ్లు గడిచే కొద్ది తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా రాణిస్తున్నారు. భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. త్వరలోనే ఈ రాష్ట్రం కొత్త శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నా"
- జగ్‌దీప్ ధన్‌కర్, ఉపరాష్ట్రపతి