భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఉత్తరాఖండ్ వెళ్లారు. అక్కడ పితోర్‌ఘఢ్‌లోని పార్వతీ కుండ్‌ కు వెళ్లి పూజలు చేశారు. స్థానిక సంప్రదాయ దుస్తులతో పాటు తలపాగా ధరించి అక్కడి వెళ్లిన మోదీ పార్వతీ కుండ్‌ వద్ద పూజలు చేశారు. అలాగే అక్కడ ప్రాముఖ్యత కలిగిన ఢంకాను వాయించి, శంఖం వూదారు. జోలింగ్‌కాంగ్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌ వద్ద ఉన్న శివ-పార్వతీ ఆలయానికి కూడా ఆయన వెళ్లారు. అక్కడ హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. పార్వతీ కుండ్‌ పరిసరాలు ఎంతో మనోహరంగా, ఆహ్లాదంగా కనిపించాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆది  కైలాశ పర్వతం వద్ద కూర్చొని మోదీ కొంత సేపు ధ్యానం చేసి పరమ శివుని ఆశీస్సులు కోరారు. చుట్టూ హిమగిరుల మధ్య ఉన్న సరోవరం ఒడ్డున కూర్చొని మోదీ పూజలు చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ట్విట్టర్‌లో మోదీ పోస్ట్ చేశారు. 



ప్రధాని మోదీ పలువురు ఆర్మీ సభ్యులతో కలిసి గుంజ్‌ అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లి వారితో చర్చించారు. ఉత్తరాఖండ్‌లోని కుమాన్‌ ప్రాంతానికి ఒక రోజు పర్యటన నిమిత్తం వెళ్లిన మోదీ గుంజ్‌ గ్రామంలో స్థానికులతో పాటు, ఆర్మీ సిబ్బందితో మాట్లాడారు. ఈ పర్యటనలో మోదీ పాటు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి కూడా ఉన్నారు. స్థానిక ప్రజలు తయారుచేసే ఉత్పత్తులతో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. మోదీ ఈరోజు పర్యటనలో పితోర్‌గఢ్‌ ప్రాంతంలో దాదాపు రూ.4,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ, విద్యుత్‌, తాగునీరు, నీటిపారుదలకు చెందిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ ప్రారంభించే ప్రాజెక్టుల్లో.. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన క ఇంద 76 గ్రామీణ రోడ్లు, 25 వంతెనలు ఉన్నాయి. అలాగే తొమ్మిది జిల్లాల్లో బ్లాక్‌ డవెలప్‌మెంట్‌ ఆఫీసులకు చెందిన 15 భవనాలను మోదీ ప్రారంభిస్తారు. అనంతరం జరిగే ర్యాలీలో పాల్గొని ప్రసంగం చేయనున్నారు.