Modi Meets Zelensky:


జెలెన్‌స్కీతో మోదీ భేటీ 


జీ 7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తరవాత ఈ ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. గతంలో చాలా సందర్భాల్లో ఉక్రెయిన్‌కి మద్దతుగా నిలిచిన భారత్..అటు రష్యాతోనూ మైత్రి కొనసాగించింది. ఈ రెండు దేశాలతో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించింది. అయితే...తామెప్పుడూ శాంతికే కట్టుబడి ఉంటామని ప్రధాని చాలా సార్లు చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఇదే విషయమై ప్రస్తావించారు. కొన్నిసార్లు ఫోన్‌ చేసి మరీ మాట్లాడారు. ఇప్పుడు జెలెన్‌స్కీతో నేరుగా భేటీ అయిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఇది అంతర్జాతీయ సమస్య అని వెల్లడించిన మోదీ...ఈ సమస్యని రాజకీయ కోణంలో చూడకూడదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మానవతా దృష్టితో చూడాల్సిన విషయం అని స్పష్టం చేశారు. 


"ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ దేశానికే పరిమితం కాదు. ఇది ప్రపంచ సమస్య. పలు విధాల్లో ప్రపంచాన్ని ఇది ప్రభావితం చేసింది. అలా అని ఈ సమస్యని ఆర్థిక, రాజకీయ కోణంలో చూడడం సరికాదు. నా వరకూ ఇది కచ్చితంగా మానవతా దృష్టిలో ఆలోచించాల్సిన విషయం. మానవ విలువలు కాపాడడం కోసం ప్రయత్నించాల్సిన సందర్భమిది. యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఆ బాధ ఎలా ఉంటుందో మా అందరి కన్నా మీకే (ఉక్రెయిన్‌ని ఉద్దేశిస్తూ) తెలుసు. గతేడాది భారత్‌కు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చారు. అక్కడి పరిస్థితులేంటో చెప్పినప్పుడు నాకు మీ కష్టాలేంటో తెలిసొచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్ తరపున మీకు అన్ని విధాలా సహరించేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ