PM Modi lauds Manmohan Singh: రాజ్యసభలో పదవీ కాలం ముగిసిన ఎంపీలకు వీడ్కోలు పలుకుతూ కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. వీల్‌చైర్‌లో నుంచి పరిపాలన అందించారని కొనియాడారు. 


"సభలో ఓటింగ్ జరిగినప్పుడు ట్రెజరీ బెంచ్‌ గెలుస్తుందని తెలిసినా మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేశారు. తన బాధ్యతల పట్ల ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. వీల్‌చైర్‌లో ఉండే ఆయన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఇవాళ ఆయనను కచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అన్ని ఏళ్ల పాటు దేశానికి ఎనలేని సేవలు అందించారు. దేశాన్ని ఆయన నడిపించిన తీరు ప్రశంసనీయం. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మాకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ 






ఆరుసార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ దేశానికి 13వ ప్రధానిగానూ బాధ్యతలు చేపట్టారు. 2004-14 వరకూ పదేళ్ల పాటు ఆయన అదే పదవిలో ఉన్నారు. 1982-1985 మధ్య కాలంలో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ పని చేశారు. RBI గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సభలో కీలక బిల్లుని ప్రవేశపెట్టింది. ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో మన్మోహన్ సింగ్‌ వీల్‌చైర్‌లో హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ ఆయన వీల్‌చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందం వ్యక్తం చేశారు. మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 


"మన్మోహన్ సింగ్‌ ఎన్నో మంచి పనులు చేశారు. ప్రధాని మోదీ ఆయనను ప్రశంసించడం చాలా సంతోషం. ప్రధానికి ధన్యవాదాలు. మంచిని పొగడాలి...చెడుని విమర్శించాలి. సభ ఇలా జరగాలని కోరుకుంటున్నాను"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు