Bengaluru-Mysuru Highway:
బెంగళూరు - మైసూరు హైవే ప్రారంభం..
కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మండ్యలోని బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించారు. దీంతో పాటు మరి కొన్ని రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 118 కిలోమీటర్ల బెంగళూరు-మైసూరు రోడ్ నిర్మాణం కోసం కేంద్రం రూ.8,480 కోట్లు ఖర్చు చేసింది. గతంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలంటే కనీసం 3 గంటల సమయం పట్టేది. ఈ హైవేతో ఆ ప్రయాణ సమయం 75 నిముషాలకు తగ్గిపోనుంది. అంతే కాదు. మండ్య ప్రాంతంలోని అభివృద్ధిలోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ రోడ్‌ను ప్రారంభించిన తరవాత మైసూరు-కుశాల్‌నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 92 కిలోమీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణం కోసం రూ.4,130 ఖర్చవుతుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 5 గంటల నుంచి 2.5గంటలకు తగ్గిపోనుంది. ఇది పూర్తైతే... బెంగళూరు, కుశాల్‌నగర్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవేను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
"కొన్ని రోజుల క్రితం బెంగళూరు మైసూరు హైవే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఈ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్విస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మన దేశ పురోగతికి బాటలు వేస్తాయి."
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సమయంలో బెంగళూరు గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. మైసూరు, బెంగళూరుకున్న ప్రాధాన్యతలేంటో వివరించారు.
"కర్ణాటకలో బెంగళూరు, మైసూరు కీలకమైన నగరాలు. బెంగళూరు టెక్నాలజీకి పేరు గాంచింది. మైసూరు సాంస్కృతిక పరంగా ఎంతో ప్రాముఖ్యం చెందింది. ఇలాంటి రెండు ముఖ్యమైన నగరాల మధ్య కనెక్టివిటీ పెంచడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది."
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ ప్రజల్ని దోచుకుందని మండి పడ్డారు. అభివృద్ధి ఊసే పట్టించుకోలేదని అన్నారు.
"2014కి ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేద ప్రజలకు ఎలాంటి న్యాయమూ చేయలేకపోయింది. పైగా వాళ్ల నుంచే డబ్బులు దోచుకుంది"
- ప్రధాని నరేంద్ర మోదీ