Modi inaugurates Atal Setu:



అటల్ సేతు ప్రారంభం..


దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు. సాధారణంగా ముంబయి నుంచి నవీ ముంబయికి చేరుకోవాలంటే గంటన్నర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల 20 నిముషాల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 21.8 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనలో దాదాపు 16 కిలోమీటర్ల మేర నిర్మాణం అరేబియా సముద్రంపైనే ఉంటుంది. భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పటిష్ఠంగా ఈ వంతెనను నిర్మించారు.





ఇందుకోసం ప్రభుత్వం రూ.17,840 కోట్లు ఖర్చు చేసింది. Mumbai Trans Harbour Link (MTHL) పై ఆరు లేన్స్ ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు వాణిజ్య పరంగానూ ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జ్ఞాపకార్థం ప్రభుత్వం ఈ వంతెనకు Atal Setu అని పేరు పెట్టింది. ప్రత్యేకత ఏంటంటే...ఈ వంతెనపై ఓపెన్ టోలింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే...వాహనం ఆగకుండానే ఆ టోల్‌ గేట్‌ని దాటుకుంటూ వెళ్లిపోవచ్చు. ఆటోమెటిక్‌గా టోల్‌ ఛార్జ్‌లు డెబిట్ అయిపోతాయి. టోల్ ధర రూ.250గా నిర్ణయించారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌కి, జవహర్‌లాల్ ఎయిర్‌పోర్ట్‌ని లింక్‌ చేయనుంది ఈ వంతెన. అయితే..బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్‌లకు మాత్రం ఈ బ్రిడ్జ్‌పై అనుమతి లేదు.