India's First Under Water Metro: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్‌లను ప్రారంభించారు. కోల్‌కత్తా మెట్రో ఈస్ట్ - వెస్ట్ కారిడార్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. మొత్తం 4.8 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం కేంద్రం రూ.4.965 కోట్లు ఖర్చు చేసింది. గ్రౌండ్ లెవెల్‌కి 30 మీటర్ల లోతులో ఈ కారిడార్‌ని నిర్మించారు. ఈ రైలుని ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. ఆయనతో పాటు కొంత మంది విద్యార్థులూ ఉన్నారు. కాసేపు వాళ్లతో ముచ్చటించారు.
హుగ్లీ నది కింద నిర్మించిన ఈ కారిడార్‌లో మెట్రో ట్రైన్ హౌరా నుంచి సాల్ట్ లేక్ వరకూ అనుసంధానించనుంది. వెస్ట్‌బెంగాల్‌లో ఈ రెండూ కీలకమైన నగరాలే. ఓ మెట్రోలో ప్రయాణిస్తూ మరో మెట్రోలోని ప్రయాణికులకు అభివాదం చేశారు ప్రధాని మోదీ. మోదీతో పాటు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పలువురు మెట్రో అధికారులు రైల్‌లో ఉన్నారు. రేపటి నుంచి (మార్చి 7) ఈ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కోల్‌కత్తాలో ఓ కీలక ప్రాజెక్ట్‌ని గతేడాదే ప్రారంభించారు ప్రధాని మోదీ. గతేడాది ఏప్రిల్‌లో అండర్ వాటర్ టన్నెల్‌లో ట్రైన్ సర్వీస్‌లను ప్రారంభించారు. ఇది కూడా భారత్‌లో తొలిసారి. ఇవి ప్రధాని మోదీ కోల్‌కత్తా ప్రజలకు ఇచ్చిన కానుకలు అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉండిపోయిన ఈ ప్రాజెక్ట్‌ని సాకారం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ రూ.15,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు.