PM Modi Gujarat Visit:


ప్రధాని మోదీ పర్యటన..


గుజరాత్‌లోని మెహ్‌సనా జిల్లాలో మొధెర గ్రామాన్ని తొలిసౌర విద్యుత్ గ్రామంగా ప్రకటించనున్నారు ప్రధాని మోదీ. పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిలో ఇదో కీలక ముందడుగుగా చెబుతోంది కేంద్రం. గుజరాత్ ప్రభుత్వం ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. వరుస ట్వీట్‌లు చేసింది. మొధెరా గ్రామంలో ప్రతి ఇంటిపైనా సౌరఫలకలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. మొత్తం గ్రామవ్యాప్తంగా 1000 సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఫలితంగా...నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండానే వీటి ద్వారా గ్రామస్థులు విద్యుత్ పొందొచ్చు. సాయంత్రం 5.30 గంటలకు మొధెరాలోని పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఆ తరవాత మోదేశ్వరీ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 7.30 గంటలకు సూర్యమందిర్‌కు వెళతారు. పునరుత్పాక వనరులను సరైన విధంగా వినియోగించుకునేందుకు వీలుగా...గుజరాత్ ప్రభుత్వం పలు ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం PMO ట్వీట్ చేసింది. సూర్య ఆలయానికి ప్రసిద్ధి అయిన మొధెరాలో సౌరవిద్యుత్ అందించటంపై సంతోషం వ్యక్తం చేసింది. 






సూర్య ఆలయానికి మెరుగులు..


సూర్య ఆలయంలో 3D ప్రొజెక్షన్‌నూ ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారు. ఈ ఆలయానికి వచ్చే పర్యాటకులకు, స్థానిక చరిత్ర తెలియజేసేలా ఈ 3D ప్రొజెక్షన్ ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఆలయాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సాయంత్రం 3D ప్రొజెక్షన్‌ను ఆపరేట్ చేస్తారు. పుష్పవతి నదీ తీరంలో ఉన్న ఈ ఆలయాన్ని చౌళుక్యుడైన కింగ్ భీమా-1 కట్టించారు. గుజరాత్‌కు మూడు రోజుల పర్యటనకు రానున్న మోదీ...అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. గుజరాత్‌లో మొత్తంగా రూ.14,500కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.