Modi Elephant Safari: ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటనలో భాగంగా కజిరంగ నేషనల్ పార్క్‌ని సందర్శించారు. అక్కడ జీప్ సఫారీతో పాటు ఏనుగంబారిపై ఊరేగారు. 1957 తరవాత ఈ నేషనల్ పార్క్‌ని సందర్శించిన తొలి ప్రధాని మోదీయే. కజిరంగ నేషనల్ పార్క్‌కి Unesco World Heritage Site గా గుర్తింపు కూడా దక్కింది. ముందు ఏనుగుపైకి ఎక్కి సవారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..ఆ తరవాత జీప్ సఫారీ కూడా చేశారు. ఆయనతో పాటు పార్క్ డైరెక్టర్ సోనాలీ ఘోష్, పలువురు అటవీ అధికారులున్నారు. ప్రస్తుతం ఈ సఫారీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండు రోజుల పాటు అసోంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. అసోం ప్రభుత్వంతో పాటు కేంద్రం సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌లని నిర్మిస్తోంది. మార్చి 8వ తేదీనే మోదీ అసోంకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ Sela Tunnel ని జాతికి అంకితం చేశారు. వికసిత్ భారత్ వికసిత్ నార్త్ ఈస్ట్ పేరిట అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సేలా టన్నెల్‌ని ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతోంది ప్రభుత్వం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సేలా పాస్ మీదుగా తవాంగ్‌కి అనుసంధానించనుంది ఈ సొరంగ మార్గం. ఇందుకోసం రూ.825 కోట్ల ఖర్చు చేశారు. 2019లో ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తరవాత UNNATI స్కీమ్‌లో భాగంగా రూ.10 వేల కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించనున్నారు. మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో రూ.55,600 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను దేశానికి అంకితం చేయనున్నారు.