ప్రధాని మోదీకి డ్రామా చేయటం రాదు, ఓ ఇంటర్వ్యూలో అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు 


కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏఎన్‌ఐతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందుప్రధాని మోదీ ఎలాంటి హడావుడి చేయరని, దాన్ని నాటకీయంగా మార్చాల్సిన అవసరం ఆయనకు లేదని అన్నారు అమిత్‌ షా. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఇలా సెటైర్లు వేశారు. "విచారణకు వెళ్లే ముందు పార్టీ కార్యకర్తల్ని పిలిచి నిరనసలు చేయించటం, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్టేజ్‌ డ్రామాలు ఆడటం లాంటివి చేయించటం మోదీకి గిట్టదు" అని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఇటీవల రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్నారు. మొదటి రోజు విచారణకు వెళ్లే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. దీన్ని ఉద్దేశించే అమిత్‌ షా అలా వ్యాఖ్యానించారు.



గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీ క్లీన్ చిట్‌ ఇవ్వటంపై కాంగ్రెస్ నేత ఎహ్‌సన్ జఫ్రీ సతీమణి జకియా జఫ్రీ సుప్రీం కోర్టులో సవాలు పిటిషన్ చేశారు. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. 2002లో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లర్లు జరిగాయి. ఈ కేసులో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ వచ్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్‌ బృందం నిర్విరామంగా పని చేసిందని, మైనార్టీ వర్గంపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి దాడులు చేశారనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవన్న సిట్‌ నిర్ధరించటాన్ని అంగీకరించక తప్పదని తేల్చిచెప్పింది సుప్రీం కోర్టు. ఈ కేసులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 63 మందికీ క్లీన్ చిట్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. గుజరాత్ అల్లర్లలో మైనార్టీ ప్రజలపై దాడుల వెనక కుట్ర ఉందంటూ జకియా జఫ్రీ 2017 అక్టోబర్‌లోనే గుజరాత్ హైకోర్ట్‌లో సవాలు చేశారు. అయితేన్యాయస్థానం ఆ పిటిషన్‌ని తిరస్కరించింది.