Modi On KCR :   కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయండి అని భోపాల్‌లో నిర్వహించిన  " మేరా బూత్ సబ్ సేజ మజ్‌బూత్ " అనే కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మోది ప్రసంగం వినేందుకు దేశం మొత్తం నుంచి బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకోడంతో ఆయన అన్ని ప్రాంతాల్లోని పార్టీ నేతల గురించి ప్రస్తావించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన కూడా అందుకే తెచ్చారని  భావిస్తున్నారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి హానికరమని . . అవినీతికి పాల్పడుతున్నాయన్న క్రమంలో  ఆయన బీఆర్ఎస్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. 


కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడతాయన్న మోదీ  


" మేరా బూత్ సబ్ సేజ మజ్‌బూత్ "  దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీ సందేశం  ఇచ్చారు. బీజేపీకి  కార్యకర్తలే అతిపెద్ద బలమని పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు పార్టీకే కాదు, దేశ లక్ష్యాలను సాధించడంలోనూ సహకరించే బలమైన సైనికులు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దది' అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రాజకీయాల్లో బూత్‌ స్థాయి ఎంతో కీలకమని పేర్కొంటూ.. ఉన్నతస్థాయి విధానాల రూపకల్పనలోనూ అక్కడి సమాచారమే ప్రధానమని తెలిపారు. అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయని విమర్శించారు. ఆ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయని.. తాము మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నామన్నారు.  ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు బీజేపీ దూరమని ప్రకటించారు.  


యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో  ఓటు బ్యాంక్ రాజకీయాలు


యూనిఫాం సివిల్ కోడ్  పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. అయితే.. దేశాన్ని వేర్వేరు చట్టాలతో ఎలా నడపాలని  మోదీ ప్రశ్నించారు.  ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పని చేయవు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోంది. 'యూసీసీ'ని అమలు చేయాలని సుప్రీం కోర్టు కూడా సూచించింది. అయితే.. ప్రతిపక్ష పార్టీలు  ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని  ప్రధాని మోదీ విమర్శించారు.


బీఆర్ఎస్‌తో ఎలాంటి లోపాయికారీ ఒప్పందాలు లేవని చెబుతున్నారా ?


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,  ఆయన కుమార్తె కవిత ప్రస్తావన ప్రత్యేకంగా నరేంద్రమోదీ తీసుకు రావడంలో రాజకీయవ్యూహం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకపోవడం.. తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు ఆపేయడంతో రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. దీంతో నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి కేసీఆర్ ను విమర్శించారని భావిస్తున్నారు. తము బీఆర్ఎస్ తో కలిసి లేమని సందేశం పంపాలనుకున్నారని..అందుకే భోపాల్ వేదిక అయినా సరే సందేశం వెళ్తందన్న ఉద్దేశంతో విమర్శించినట్లుగా చెబుతున్నారు. 








Join Us on Telegram: https://t.me/abpdesamofficial