Modi on Moscow Concert Hall Attack: రష్యాలోని మాస్కోలో అర్ధరాత్రి కాల్పులు సంచలనం సృష్టించాయి. ఇప్పటి వరకూ 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లో (Moscow Terror Attack) ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఉగ్రదాడుల్ని ఖండించారు. భారత్ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. రష్యాకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


"మాస్కోలో జరిగిన ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు మేం అండగా నిలబడతాం"


- ప్రధాని నరేంద్ర మోదీ






మార్చి 22వ తేదీన రాత్రి కొంత మంది దుండగులు మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి చొరబడ్డారు. అప్పటికే ఆ హాల్ కిక్కిరిసి ఉంది. ఉన్నట్టుండి అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా మిలిటరీ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ధాటికి పైకప్పు ఊడి పడిపోయింది. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ కూడా పెట్టింది. నిజానికి నెల రోజుల కిందటే అమెరికా రష్యాని హెచ్చరించింది. ఉగ్రదాడి జరుగుతుందని అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని వెల్లడించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న సమయంలో మాస్కోలో ఇలా ఉగ్రదాడి జరగడం సంచలనమవుతోంది. Crocus City Hallలో దాడి జరిగిన నిముషాల్లోనే అధ్యక్షుడు పుతిన్‌కి సమాచారం అందించినట్టు అధికారులు వెల్లడించారు.