Top Leaders Convoy Reduction : అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, ఇంధన సంక్షోభం తలెత్తుతున్నందున ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కఠినమైన పొదుపు మార్గానికి పిలుపునిచ్చారు. ప్రజలకు చెప్పడమే కాకుండా తాను స్వయంగా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఏకంగా 50 శాతం తగ్గించుకోవాలని ఎస్పీజీ ని ఆదేశించి స్వయంగా ఆదర్శంగా నిలిచారు. భద్రతా నిబంధనలైన బ్లూ బుక్ గైడ్‌లైన్స్‌కు భంగం కలగకుండానే, ఇంధన పొదుపు కోసం తన కాడ్లేలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని, అయితే ఇందుకోసం కొత్తగా వాహనాలను కొనకూడదని ఆయన స్పష్టం చేశారు.
స్వయంగా ప్రధాని కూడా కాన్వాయ్ తగ్గించుకోవడంతో కేంద్ర మంత్రులుకూడా అదే బాటపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వంటి నేతలు ఇప్పటికే తమ అధికారిక కాన్వాయ్‌లను తగ్గించుకున్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే బాటలో నడుస్తూ, అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, ప్రభుత్వ వనరులను పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. తన కాన్వాయ్ ను కూడా తగ్గించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్న తరుణంలో దేశాన్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచేందుకు చేపట్టిన అతిపెద్ద పాలనాపరమైన సంస్కరణగా భావిస్తున్నారు.
కేవలం ప్రభుత్వమే కాదు, దేశ పౌరులందరూ ఈ క్లిష్ట సమయంలో దేశ బాధ్యత తో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం బయటకు పోకుండా అడ్డుకోవడం కూడా ఒక రకమైన దేశభక్తేనని మోదీ చెబుతున్నారు. ఇందులో భాగంగానే, కనీసం ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు. పసిడి దిగుమతుల కోసం ఖర్చయ్యే విదేశీ నిధులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతున్నందున ఆయన ఈ కీలక విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, భారతీయులు విదేశీ పర్యటనలు, విదేశాల్లో వివాహాలు వంటి విలాసాలను పక్కన పెట్టి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మోదీ కోరారు. ప్రతి వస్తువు కోసం మనం దిగుమతులపైనే ఆధారపడితే దేశం ఎలా ప్రగతి సాధిస్తుంది అని ప్రశ్నిస్తూ స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. అనవసర విదేశీ ప్రయాణాలను నివారించడం ద్వారా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని, ఇది ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని తట్టుకోవడానికి భారత్‌కు శ్రీరామరక్ష అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ సాధారణ పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తన కాన్వాయ్‌ను సగానికి సగం తగ్గించుకోవడం ద్వారా మోదీ ఇచ్చిన సందేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అగ్రనేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ కలిసికట్టుగా అడుగులు వేస్తేనే, ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉంటుందనేది ఈ ఆస్టెరిటీ డ్రైవ్ వెనుక ఉన్న పరమార్థం.
