Pegasus Spyware: 'పెగాసస్' స్పైవేర్ వ్యవహారం.. విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABP Desam Updated at: 30 Jul 2021 12:49 PM (IST)

పెగాసస్ స్పై వేర్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.

పెగాసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టు విచారణ

NEXT PREV

పెగాసస్ నిఘా వ్యవహారంపై వచ్చే వారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు సహా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రముఖ జర్నలిస్ట్‌లు ఎన్​. రామ్, శశి కుమార్ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. నేటి (జులై 30న) ఉదయం న్యాయవాది కపిల్ సిబల్.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ పిటిషన్​ను ప్రస్తావించారు. పెగాసస్ వ్యవహారం (Pegasus Spyware)తో కీలక పరిణామాలు చోటుచేసుకంటున్నానని వివరించారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వచ్చే వారం వాదనలు వినేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కారణమైంది పెగాసస్.


ఏ విధమైన నిఘా కోసమైనా పెగాసస్ స్పైవేర్​ను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపయోగించారా అనే విషయంపై సమాధానం చెప్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. ఈ సాఫ్ట్​వేర్ లైసెన్సు ప్రభుత్వం వద్ద ఉందా అనే విషయంపై సైతం స్పష్టత కావాలని విజ్ఞప్తి చేశారు.


జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, విపక్ష నేతలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మొత్తం 142 మంది భారతీయులు పెగాసస్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు పలు మీడియా సంస్థలు తెలసుకున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇందులో కొందరి ఫోన్లు హ్యాక్​ అయినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత వివరాలపై నిఘా ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. 


అసలేంటి పెగాసస్..


ప్రస్తుతం దేశమంతా పెగాసస్ స్పైవేర్ వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. స్పియర్-ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించి టెక్స్ట్ లింక్‌లు లేదా మెసేజెస్ క్లిక్స్ ద్వారా మొబైల్ ఫోన్లలోకి స్పైవేర్ చొప్పించే స్థాయి నుంచి.. 'జీరో-క్లిక్' అటాక్స్‌ ప్రయోగించే స్థాయికి ఎదిగిన స్పైవేర్ పద్ధతులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులను వణికిస్తున్న 'పెగాసస్‌' స్పైవేర్ ని అత్యంత శక్తిమంతమైనదిగా టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫోన్ యూజర్ ఎలాంటి లింక్ ఓపెన్ చేయకపోయినా, అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకపోయినా పెగాసస్‌ స్పైవేర్ మొబైల్‌ని హ్యాక్ చేస్తుందని గుర్తించారు.


'పెగాసస్‌' స్పైవేర్ ఒక్కసారి మొబైల్ ఫోన్ లోకి చొరబడితే అది మొబైల్ యజమాని కంటే ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుందని నిపుణులు అంటున్నారు.



పెగాసస్‌ ఐఫోన్‌ మొబైల్స్‌లోకి చొరబడిన క్షణాల్లోనే కీలకమైన వివరాలతో పాటు అధికారాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్టు, మెసేజెస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ వంటి అన్ని విషయాలనూ యాక్సెస్ చేస్తుంది. ఆ విషయాలన్నిటినీ హ్యాకర్‌కి చేరవేస్తుంది         -     సెక్యూరిటీ పరిశోధకులు

Published at: 30 Jul 2021 11:35 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.