Parliament Winter Session News:



పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..


పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాడివేడిగానే కొనసాగుతున్నాయి. లోక్‌సభ దాడి తరవాత ఇవి మరింత వేడెక్కాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలోనే పలువురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ TMC ఎంపీ కల్యాణ్ బెనర్జీ రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌కర్‌ని అనుకరించారు. ఈ మిమిక్రీ చేస్తుండగా రాహుల్ గాంధీ వీడియో తీశారు. ఇది వివాదానికి దారి తీసింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ఈ వాదనల మధ్యే ప్రధాని నరేంద్రమోదీ ధన్‌కర్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి అనుమానాలను తాను 20 ఏళ్లుగా భరిస్తున్నట్టు చెప్పారు. ఇదంతా స్వయంగా ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ వెల్లడించారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనకు మోదీ కాల్ చేసి మాట్లాడినట్టు వివరించారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ నాకు కాల్ చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కొంత మంది ఎంపీలు వ్యవహరించిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ఇలాంటివి చేయడంపై అసహనానికి లోనయ్యారు. తానూ 20 ఏళ్లుగా ఇలాంటి అనుమానాలు భరిస్తున్నట్టు చెప్పారు. ఇది నిజంగా దురదృష్టకరమని అన్నారు. కానీ నేను ప్రధానితో ఒకటే విషయం చెప్పాను. ఇలాంటి అనుమానాలు నన్ను అడ్డుకోలేవని వివరించాను. నా విధులు నేను నిర్వర్తిస్తానని చెప్పాను. విలువలకు నేను ఎప్పుడూ కట్టుబడే ఉంటాను"


- జగ్‌దీప్ ధన్‌కర్, రాజ్యసభ ఛైర్మన్ 


 






ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే తమ భావాలను వ్యక్తపరుచుకోవచ్చని, కానీ అవి మర్యాదపూర్వకంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.





ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతికి కాల్ చేయడం పట్ల రాహుల్ గాంధీని రిపోర్టర్లు ప్రశ్నించగా కామెంట్ చేయబోనంటూ ఆయన వెళ్లిపోయారు.