Paritala Sunitha Comments: మోసానికి, నయవంచనకు సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని.. మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పాలన విధ్వంసాలతో మొదలైందన్నారు. ఆయన ఏ రోజు అభివృద్ధి వైపు చూడకపోగా.. ఉన్న వాటిని నాశనం చేశారన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రాజధాని అమరావతేనన్నారు. ఆయన చిత్తశుద్ధిగా వ్యవహరించి ఉంటే.. ఇప్పటికే అమరావతి రాజధానిగా ఒక మంచి స్థాయిలో ఉండేదన్నారు. కానీ ఒక కుట్ర అక్కడి నుంచి రాజధాని తరలించాలని చేసిన ప్రయత్నమే.. ఇప్పుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏది అంటే.. ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఆ రోజు మూడు పంటలు పండే భూమిని.. అమరావతి కోసం రైతులు త్యాగం చేస్తే.. అదే రైతుల్ని రోడ్డుకీడ్చారన్నారు.
మహిళలని కూడా చూడకుండా అవమానాలకు గురి చేయడం, రైతులపై లాఠీ ఛార్జిలు చేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. మరోవైపు జగన్ ని నమ్ముకున్న వారిని కూడా మోసం చేసిన ఘనుడని సునీత వ్యాఖ్యానించారు. ఓవైపు సొంత బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతూ.. మరోవైపు సొంత చెల్లి, తల్లిని దూరం పెట్టారన్నారు. కుటుంబసభ్యుల్నే ఇంత దారుణంగా మోసం చేసిన జగన్.. నమ్ముకున్న ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు అన్యాయం చేశారన్నారు. జగన్ వెంట ఎంతో నమ్మకంగా నడిచిన మోపిదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను పక్కన పెట్టారంటే ఆయన ఎంతో స్వార్థ పరుడో అర్థమవుతోందన్నారు. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేశారని.. కడప స్టీల్ ప్లాంట్ లేదు, అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచాడన్నారు. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేశాడని విమర్శించారు.
గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన ఉద్యోగ, కార్మిక వర్గాలను తీవ్రంగా మోసం చేశారన్నారు. అందుకే ఇప్పుడు ఉద్యోగ, కార్మిక లోకం అంతా రోడ్డెక్కి నిరసలు తెలియజేస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో క్రీడల గురించికానీ, క్రీడా మైదానాల గురించి కానీ ఏ రోజు పట్టించుకోని జగన్..ఇప్పుడు ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్రా అంటూ యువతను మోసం చేశారన్నారు. ఏటా జాబ్ కేలండర్ ఇస్తానని, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి యువతకు నమ్మకద్రోహం చేశారని కామెంట్ చేశారు. ఇన్ని రోజులు జనంతోనూ, యువతతోనూ, ఉద్యోగ, ఉపాధ్యాయులతో ఆటలాడిన జగన్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని సునీత అన్నారు.