Telangana Government Launches Praja Palana: మహబూబ్ నగర్: సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి సి.దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) తెలిపారు. సమీకృత కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District)కు సంబంధించి నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమం సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజా పాలన ( Praja Palana) కార్యక్రమం చేపట్టి గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరాలలో ప్రజల నుంచి సంక్షేమ పథకాలైన ఆరు గ్యారంటీల లబ్ది కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు.


ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన.. 
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక బాధ్యతతో సక్రమంగా వాటిని ప్రజలకు అందించే ఆలోచనతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. హామీల అమలులో భాగంగానే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అధికారులు ప్రజల ముందుకు వెళ్లి వాటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల నుండి దరఖాస్తులను ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు స్వీకరించనున్నారు. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేని వారి నుంచి సైతం అనంతరం ఇద్దరు అధికారులు గ్రామాల్లో కొనసాగుతూ ప్రజల వద్ద నుంచి ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన వారు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు ఇవ్వవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఇచ్చిన వాగ్దానాన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. ప్రజా పాలన  కార్యక్రమం అమలుకు మరిన్ని సూచనలు ఇస్తే పాటిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.


ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని, ప్రభుత్వం  ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజల వద్దకు వెళ్లి పథకాలు పొందేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమం పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఆ పది రోజులపాటు వీలైనన్నీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కలెక్టర్లు, జిల్లా అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంపై అన్ని రకాలుగా ప్రచారం నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.