PM Modi Pariksha Pe Charcha: ఇళ్లలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోదీ సూచించారు. పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha Highlights) కార్యక్రమంలో విద్యార్థులకు ఈ సలహా ఇచ్చారు. ఇళ్లను no gadget zone గా మార్చుకోవాలని, కుటుంబ సభ్యులతో సమయం గడపాలని తెలిపారు. టెక్నాలజీ కారణంగా అందరికీ దూరమైపోకూడదని స్పష్టం చేశారు. లైఫ్‌స్టైల్‌ని మార్చుకోవాలని...ఆరోగ్యకరమైన పోటీ ఇచ్చే విధంగా మనసుని సన్నద్ధం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్డెట్స్‌కే కాకుండా మన శరీరాలనూ రీఛార్జ్ చేసుకోవాలంటూ విద్యార్థులకు అర్థమయ్యే భాషలో వివరించారు ప్రధాని మోదీ. గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర అవసరమని తెలిపారు. 


"ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి"


- ప్రధాని నరేంద్ర మోదీ 


 






విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న అంశాన్నీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. కొందరు తమకు తామే అనవసరంగా ఒత్తిడి ఫీల్ అవుతారని చెప్పారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల వల్లా విద్యార్థులపై ఈ ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.


"కొన్ని సార్లు విద్యార్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. అనుకున్న స్థాయిలో మార్కులు రాలేదని బాధ పడతారు. కానీ మీరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నప్పుడు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. క్రమంగా మీ పర్‌ఫార్మెన్స్‌ని పెంచుకోండి. ఆ తరవాతే పరీక్షలకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలుగుతారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం నాకు కూడా ఓ పరీక్ష లాంటిదే"


- ప్రధాని నరేంద్ర మోదీ