Pappu Yadav demands for Re NEET 2024 | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బిహార్ రాష్ట్రం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పరీక్షపై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు. బిహార్ రాష్ట్రం పుర్నియా నుంచి ఎంపీగా ఎన్నికై మంగళవారం లోక్ సభలో ప్రమాణం చేసిన పప్పూ యాదవ్ రీనీట్ అని రాసి ఉన్న ఒక టీషర్ట్ వేసుకొచ్చారు. అయితే పప్పూ యాదవ్ అక్కడితో ఆగలేదు.
ప్రమాణం చేసిన అనంతరం సైతం.. రీ నీట్, బిహార్ కి స్పెషల్ స్టేటస్, సీమాంచల్ జిందాబాద్, మానవతా వాద్ జిందాబాద్, బీమ్ చిందాబాద్, సంవిధాన్ జిందాబాద్ అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రెజరీ బెంచ్ పై ఉన్న సభ్యుడితో ఆయనకు వాగ్వాదమూ జరిగింది. ప్రమాణం అనంతరం బెంచ్ సభ్యులు ఏదో అంటుంటే.. ‘‘నేను ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు తెలుసు. మీరు గుంపుగా వస్తారు. కానీ నేను సింగిల్ గా వస్తాను. నాలుగో సారి ఇండిపెండెంట్ గా గెలిచాను. మీరు నాకు నేర్పిస్తారా?’’ అంటూ ఛైర్మన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పప్పూ యాదవ్ స్టేజ్ దిగారు.
ఆరు సార్లు ఎంపీ..
పప్పు యాదవ్ 1990 లో మొదటి సారి బిహార్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే 1991 లో తిరిగి లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికై ఎంపీ అవతారమెత్తారు. 1991, 1996, 1999, 2004, 2014, 2024 ఇలా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన ప్రస్తానం మొదలు పెట్టిన పప్పు యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, లోక్ జన శక్తి పార్టీ, ఆర్‌జేడీ ఇలా పలు పార్టీల తరఫున పోటీ చేసి గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయా పార్టీలు బయటకు పంపినప్పుడల్లా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవారు. 2015లో ఆర్ జేడీ నుంచి ఆయన్ని బయటకు పంపగానే సొంతంగా జన అధికార్ పార్టీని పెట్టారు అయితే ఆ పార్టీ కేవలం రెండు శాతం ఓటు బ్యాంకుతో పెద్దగా ప్రభావం చూపకపోవదంతో దాన్ని 2024 ఎన్నికల కు ముందు కాంగ్రెస్‌లో కలిపేశారు.
వివాదాలకు కేంద్ర బిందువు..
పప్పు యాదవ్ ముందు నుంచీ వివాదలాకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. 1998లో అజిత్ సర్కార్ అనే సీపీఎం నాయకుడి హత్య జరిగిన నేపథ్యంలో.. పప్పు యాదవ్ కు ఈ కేసుతో సంబంధం ఉందని 2008లో తేలింది. దీంతో ఆయన జైలుకెళ్లారు. జైల్లో ఉంటూ కూడా పలు వివాదాలతో వార్తల్లోకెక్కారు. నియంత్రణ లేకుండా సెల్ ఫోన్లు వాడారని, జైలు నుంచే పలువుర్ని సంప్రదించారని ఆయనపై ఆరోపణలున్నాయి. 2013లో పాట్నా హైకోర్టు ఆయనపై ఈ కేసును కొట్టేసింది.
2013లో తన ఆటో బయోగ్రఫీ విడుదల చేసిన పప్పూ యాదవ్.. 2001లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ముగ్గురు ఎంపీలకు డబ్బులివ్వడంతో వారు ఎన్ డీ ఏకు మద్దతిచ్చారని వెల్లడించారు. అలాగే 2008 అవిశ్వాస సమయంలో కాంగ్రెస్, భాజపా రెండు పార్టీలు ఎంపీలకు 40 కోట్ల చొప్పున ఆఫర్ చేశాయని సైతం వెల్లడించి దుమారం లేపారు.
2015లో ఓ ఎయిర్ హోస్టెస్ ని చెప్పుతో కొట్టినట్లూ ఆరోపణలెదుర్కొన్న పప్పూయాదవ్ 2021లో ఓ 32 ఏళ్ల వ్యక్తిని కడ్నాప్ చేశారన్న ఆరోెఫణలపై మరోసారి అరెస్టయ్యారు.