విమానమెక్కి గాల్లో విహరించాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. పాపం.. ఆ పాముకు కూడా అదే కోరిక ఉంది కాబోలు.. ఎంచక్క విమానం ఎక్కేసి ఎగిరిపోవాలనుకుంది. కానీ, దొరికిపోయింది. ఈ పాము ప్లానింగ్ చూస్తే.. అది తప్పకుండా ‘Snakes on a Plane’ అనే హాలీవుడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుందేమో అనిపిస్తుంది. ఈ ఘటనలో ప్రయాణికులు మాత్రం చాలా అదృష్టవంతులు. వారు విమానంలోకి ప్రవేశించక ముందే ఈ పాము ప్లాన్ బయటపడిపోయింది. 


కోల్‌కతా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయంగా మారింది. రాయ్‌పూర్ నుంచి కోల్‌కతాకు వచ్చిన ఇండిగో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో ఓ చోట పార్క్ చేశారు. అనంతరం ఆ విమానం ముంబయి వెళ్లాల్సి ఉంది. ఈ సందర్భంగా సిబ్బంది విమానంలోకి ప్రయాణికుల లగేజ్‌ను లోడ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఓ పాము వేగంగా విమానం వద్దకు వచ్చింది. బ్యాగేజ్ బెల్ట్ మీదకు ఎక్కి.. విమానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బ్యాగేజ్ బెల్ట్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి.. ఉన్నతాధికారులకు ఈ సమాచారాన్ని అందించారు. 


అటవీ అధికారులు అక్కడికి చేరుకొనే సరికి ఆ పాము విమానం బ్యాగేజ్ విభాగంలోని స్తంభాన్ని చుట్టుకుని కనిపించింది. రెస్క్యూ సిబ్బంది దాన్ని జాగ్రత్తగా పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టారు. లక్కీగా ఆ సమయానికి ప్రయాణికులు విమానంలో లేరు. దీంతో అంతా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తిగా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం ముంబయి బయల్దేరింది. ప్రస్తుతం ఈ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


వీడియో:


కొన్నాళ్ల కిందట అమెరికాలోని టొరెన్ నుంచి మెక్సికో సిటీ వెళ్తున్న ‘ఎయిరో మెక్సికో’ విమానంలో పాము దూరింది. ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌ను లగేజీ కంపార్ట్‌మెంటులో పెట్టడానికి డ్యాష్‌బోర్డు తెరిచాడు. అంతే.. అందులో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఖంగుతున్న ఆ ప్రయాణికుడు భయంతో కేకలు పెట్టాడు. దీంతో మిగతా ప్రయాణికులు సైతం హడలిపోయారు. అప్పటికప్పుడు విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పాము ఉన్న డ్యాష్‌బోర్డ్‌ను దుప్పటితో మూసేసి.. తాడులతో కట్టేసి, టేపులతో మూసేశారు. విమానం ల్యాండైన తర్వాత యానిమల్ కంట్రోల్ సిబ్బంది వచ్చి పామును స్వాధీనం చేసుకున్నారు.  


ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత జర్మనీకి చెందిన ఓ ప్రయాణికుడు ఏకంగా 20 పైగా పాములతో విమానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పాములను చిన్న చిన్న పెట్టల్లో పెట్టి, ఓ సంచిలో సర్దుకుని డస్సల్‌డర్ఫ్‌ విమానాశ్రయం నుంచి రష్యాకు చేరుకున్నాడు. రష్యాలోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయం దిగిన తర్వాత.. అధికారులు అతడి లగేజీని తనిఖీ చేయగా పాములు కనిపించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పాముల కోనుగోలుకు సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని, అందుకే డస్సల్‌డర్ఫ్ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారని అతడు తెలిపాడు. అయితే, రష్యా అధికారులు మాత్రం అతడికి అనుమతి ఇవ్వలేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆ పాములను మాస్కో జూకు తరలించారు.