Palnadu Crime News: రోజురోజుకూ గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. నిన్నటికి నిన్న ఓ ఉపాధ్యాయుడు పేపర్ వేల్యూషన్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోగా ఈరోజు మరో ఉపాధ్యాయుడు ప్రాణాలు విడిచాడు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు మూల్యాంకనం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. 


అసలేం జరిగిందంటే..?


పల్నాడు జిల్లా ఫిరంగిపురంకు చెందిన జోజప్ప అనే ఉపాధ్యాయడు రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామం లో ఎంపీపీఎస్ ఎస్సీ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే నేడు పదో తరగతి ప్రశ్నా పత్రాల మూల్యాంకనం కోసం నరసరావుపేట సెయింట్ ఆన్స్ పాఠశాలకు వెళ్లారు. పేపర్లు వాల్యుయేషన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న మరికొంత మంది ఉపాధ్యాయులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 


నిన్నటికి నిన్న టీచర్ శ్రీనివాసరావు మృతి


బాపట్ల  జిల్లా మున్సిపల్ స్కూల్ లో మూల్యాంకనం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు(48) గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పేపర్ దిద్దుతూ ఒక్కసారిగా కుప్ప కూలి‌ పడిపోయిన శ్రీనివాసరావు.. బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ తో‌‌ మృతి చెందినట్లు వైద్యల‌ వెల్లడించారు. అయితే శ్రీనివాస రావు పర్చూరులో గణిత ఉపాద్యాయుడుగా పని చేస్తున్నాడు. 


ఇటీవలే ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు బాగున్న బాలుడు భోజనం చేసిన తర్వాత నుంచి ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరాడడం లేదని తన స్నేహితులతో చెప్పాడు. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపగా వెంటనే వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. బాగా చదువుకొని తమకు చక్కగా చూసుకుంటాడని అనుకున్న కొడుకు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏంటా అని కన్నీరుమున్నీరవుతున్నారు. 


గుండెపోటు ఎందుకు వస్తుంది?


గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే  గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే. హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.