Turkey Earthquake:


టర్కీ సిరియాలో రోజురోజుకీ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలు దేశాల సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి. భారత్‌ కూడా NDRF బృందాలను పంపింది. పెద్ద ఎత్తున వైద్య సాయమూ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఓ పాకిస్థానీ కూడా టర్కీ సిరియా బాధితులకు పెద్ద ఎత్తున విరాళం ఇచ్చాడు. ఓ అజ్ఞాత వ్యక్తి 30 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాలోని టర్కీ ఎంబసీ కార్యాలయానికి వెళ్లి ఈ విరాళం అందించినట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ వార్త తనను ఎంతో కదిలించిందని అన్నారు. 


"ఓ అజ్ఞాత పాకిస్థాన్ వాసి టర్కీ సిరియా బాధితుల కోసం 30 మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడం నన్నెంతో కదిలించింది. అమెరికాలోని టర్కీ ఎంబసీకి వెళ్లి ఈ డొనేషన్ ఇచ్చాడని తెలిసింది. ఇలాంటి కష్టకాలంలో కావాల్సింది ఈ మానవత్వమే" 


-షెహబాజ్ షరీఫ్, పాక్ ప్రధాని 


అన్ని దేశాలతో పాటు పాకిస్థాన్‌ కూడా టర్కీ సిరియాకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. పాకిస్థానీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ టర్కీ బాధితులకు అవసరమైన సాయం చేస్తోంది.