Valentines Day Special: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చేసింది. రేపే వాలెంటైన్స్ డే. ఈ రోజున ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు గులాబీ పువ్వు ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తే, ఇంకొందరు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మరికొందరు ఏదైనా రొమాంటిక్ ప్లేస్ కు తీసుకెళ్తారు, లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో ప్రేమికుల రోజును కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారని తెలిసిందే. అలాంటి ఓ సంప్రదాయం మన పొరుగు రాష్ట్రంలోనూ ఉంది. 


ఛత్తీస్ గఢ్‌లో కాస్త ప్రత్యేకం


ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. తన ప్రేమను వ్యక్తం చేయడానికి యువకుడు తన ప్రేయసికి వెదురుతో చేసిన దువ్వెన ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. దీనర్థం ఆ వ్యక్తికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని, తనతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాడని, తనను తన లైఫ్ లోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాడని.


ఆ దువ్వెన ఎంతో అపురూపం


ప్రియుడు ప్రేమికుల రోజు అందించిన ఆ వెదురు దువ్వెన ఇద్దరికి ఎంతో ప్రత్యేకం. నిజానికి ఆదివాసీలు నేటికీ తమ పాత సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. గిరిజన సమాజంలో, ధృవ కులానికి చెందిన యువకులు అందమైన వెదురు బుట్టలు, వెదురు దువ్వెనలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఆ అబ్బాయి అమ్మాయికి ఇష్టమైతే తాను బంగారు, వెండి గీతలు ఉన్న చెక్క గొడ్డలిని తిరిగి అందిస్తుంది. అలా ఆ యువకుడు వ్యక్తం చేసిన ప్రేమకు సమాధానం ఇస్తుంది. ఈ కానుకలను ఇరు వర్గాల వారు అంగీకరిస్తే, కుటుంబాలు వారికి కుల ఆచార వ్యవహారాలతో గ్రామంలో వివాహం చేస్తారు. ప్రకృతిని ప్రేమించే గిరిజనులు తమ జీవిత భాగస్వాములకు అలాంటి బహుమతులను ఇస్తారు. అలాంటి బహుమతులతో గిరిజనలు తమ జీవితాన్ని జరుపుకుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న సాంప్రదాయం.


గిరిజన యువత ప్రేమను ఇలా వ్యక్తం చేస్తుంది..


బస్తర్ లో నివసించే గిరిజన వాసులు తమ ప్రేమను చాటుకునేందుకు శతాబ్దాలుగా ఈ అరుదైన, విశిష్ట సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మండాయి జాతరల సమయంలో యువతీ యువకులు తమకు ఇష్టమైన వారిని ఎంచుకుంటారు. వారికి తమ ప్రేమ, పెళ్లి అభ్యర్థను తెలిపేందుకు వెదురుతో చేసిన బుట్టు, వెదురుతో చేసిన దువ్వెన ఇస్తారు. యువకుడు చేసిన అభ్యర్థన యువతికి ఓకే అయితే మరుసటి రోజు అదే జాతరలో ఆ యువతి తన తలపై ఆ వెదురు దువ్వెనను, చేతిలో వెండి పట్టీలున్న చెక్క గొడ్డలిని రిటర్న్ గిఫ్ట్ గా అందిస్తుంది. అలా యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడతారు. 


ఫిబ్రవరిలో ఛత్తీస్ గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో జాతర


ఫిబ్రవరి నెలలో ఛత్తీస్ గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో మండై జాతర జరుగుతుంది. ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు యువకులు వెదురు బుట్టలు, వెదురు దువ్వెన అందిస్తారు. రెండోరోజు అమ్మాయిలు రిటర్న్ గిఫ్ట్స్ అందిస్తారు. మూడో రోజు ఇంట్లో కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి జరిపిస్తారు. ఈ వేడుకలకు అమ్మాయిలు, అబ్బాయిలు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరిస్తారు. దుస్తులు, నగలు ధరించి జాతరలో పాల్గొంటారు.