Pakistan Economic Crisis: 



ఆర్థిక ఒత్తిడి 


పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకీ మరింత దిగజారిపోతోంది. డాలర్‌తో పోల్చి చూస్తే పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. Business Recorder ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం...ప్రపంచవ్యాప్తంగా అప్పులపాలైన 15 దేశాల జాబితాలో పాకిస్థాన్‌ కూడా ఉంది. కోట్ల రూపాయల అప్పులు తీసుకుని చెల్లించలేక తిప్పలు పడుతోంది. వీలైనంత త్వరగా ఈ అప్పుల ఊబిలో నుంచి పాక్ బయటపడాల్సి ఉందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి తీసుకున్న అప్పులే కాదు. దేశంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలూ భారీగానే ఉన్నాయి. ఇవన్నీ చెల్లించడం పాక్ వల్ల కాదని ఇప్పటికే తేలిపోయింది. దేశీయంగా బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న రుణాల వాటాయే 21%గా ఉంది. ఈ నెల మొదట్లోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి వడ్డీ రేట్‌లను 100 బేస్ పాయింట్‌ల వరకూ పెంచింది. ఫలితంగా...పాక్‌పై మరింత ఒత్తిడి పడనుంది. వచ్చే ఏడాది నాటికి పాకిస్థాన్‌ వద్ద 40 బిలియన్ డాలర్లు ఉంటే తప్ప ఈ అప్పులన్నీ తీర్చడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ తీసుకున్న అప్పుల వడ్డీయే దాదాపు 30 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్‌లో డబ్బులు లేక చేయి చాచాల్సి వస్తోంది. మరో సంచలన విషయం ఏంటంటే...జూన్‌ నెల తరవాత కనీసం అప్పు కూడా పుట్టదని తేల్చి చెబుతున్నారు ఎక్స్‌పర్ట్‌లు. అత్యంత తక్కువ ఆదాయమున్న దేశాల లిస్ట్‌లో పాకిస్థాన్ చేరనుంది. ఏదో ఓ పరిష్కారం చూపకపోతే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. 


డీజిల్ కొనడానికీ డబ్బుల్లేవు 


పాకిస్థాన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్ట్‌లు సంచలన విషయాలు చెప్పారు. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. భారత్‌తో యుద్ధం చేసేంత సత్తా పాకిస్థాన్‌కు లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సైన్యం, యుద్ధ ట్యాంకులతో భారత్‌తో పోరాడటం చాలా కష్టమని అన్నారు కమర్ జావేద్. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో 25 మంది జర్నలిస్ట్‌ల ముందే ఈ వ్యాఖ్యలు చేశారని జర్నలిస్ట్‌లు చెబుతున్నారు. "భారత్‌తో యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్థాన్ సైన్యానికి లేదు" అని ఆయన చెప్పినట్టుగా వెల్లడించారు.  2016-22 మధ్య కాలంలో పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కమర్. 2021 ఫిబ్రవరిలో మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల మధ్య భేటీ జరిగింది. LAC వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏమీ రాకుండా చూసుకుంటామని రెండు దేశాలూ అంగీకరించాయి. ఇక మరో కీలక విషయం ఏంటంటే..2021లో ఈ ఒప్పందం కుదిరిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌లో పర్యటించాలని అనుకున్నారట. అంతే కాదు. భారత్‌ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో బజ్వా రహస్య మంతనాలూ జరిపినట్టు తెలుస్తోంది. 


"యుద్ధ ట్యాంకులు కండీషన్‌లో లేవని కమర్ జావేద్ బజ్వా మాతో చెప్పారు. కనీసం సైన్యాన్ని ఓ చోట నుంచి మరో చోటకు తరలించాలన్నా వాహనాలకు సరిపడా డీజిల్ అందుబాటులో లేదు. దాదాపు 20-25 మంది జర్నలిస్ట్‌ల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు"



- పాక్ జర్నలిస్ట్‌లు