Pakistan Blast: 


మసీదు వద్ద దాడి 


పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్‌లోని ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో సమీపంలో భారీగా పేలుడు శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి మసీదు కూడా కొంత మేర ధ్వంసమైంది. ఈ దాడిలో 28 మంది మృతి చెందగా...83 మంది తీవ్రంగా గాయపడ్డారు. మసీదు శకలాల కింద కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి
తరలించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు. ఆంబులెన్స్‌లను తప్ప మరే వాహనాలనూ అనుమతించడం లేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం..మసీదు పైకప్పు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు తేలింది. చనిపోయిన 17 మందిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఆర్మీ యూనిట్ ఆఫీస్‌కు దగ్గర్లోని మసీదు వద్ద ఇలాంటి దాడి జరగటం సంచలనమవుతోంది. ఈ పేలుడు శబ్దం దాదాపు 2 కిలోమీటర్ల వరకూ వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. చాలా సేపటి వరకూ పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేసిందని చెప్పారు. ప్రార్థనలు చేస్తున్న వారిలోనే ముందు వరుసలో కూర్చుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌ లోనూ పాక్‌లో ఇలాంటి దాడే జరిగింది. ఇస్లామాబాద్‌లో జరిగిన దాడిలో ఓ పోలీస్ ప్రాణాలు కోల్పోయాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే పాక్ పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఓ పూట తిండి తినడానికీ అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలు చాలవన్నట్టు ఉగ్రవాదమూ వారిని వెంటాడుతోంది.