Pakistan asks China to stop Brahmaputra river from entering India: బ్రహ్మపుత్ర నది నీటిని అడ్డుకోవాలని చైనాను పాకిస్తాన్ కోరినట్లుగా తెలుస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీనికి ప్రతీకారంగా తమ మిత్రదేశమైన చైనాతో పాకిస్తాన్ ఇలా కుట్రలు చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నది టిబెట్‌లోని హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది. ఈ నదినిచైనాలో యార్లుంగ్ జాంగ్‌బోగా, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఇది బంగ్లాదేశ్ వరకూ వెళ్తుంది. అక్కడ జమునాగా పిలుస్తారు. మొత్తం 2,900 కి.మీ. ప్రవహిస్తుంది. ఇది భారత్ ఈశాన్య రాష్ట్రాలకు ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు బంగ్లాదేశ్‌కు జీవనాడి లాంటిది.
బ్రహ్మపుత్రనదిపై చైనా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడవచ్చు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. బ్రహ్మపుత్ర నీటిలో చైనా నుండి వచ్చే వాటా తక్కువే అయినప్పటికీ ఈ నీరు కీలకమైన సమయాల్లో అవసరం. చైనా ఆనకట్టలో నీటిని నిల్వ చేసి, వర్షాకాలంలో ఒకేసారి విడుదల చేస్తే, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్రమైన వరదలు సంభవించవచ్చు. బ్రహ్మపుత్ర నదిపై చైనా చాలా కాలంగా కుట్రలు చేస్తోంది. 2016లో చైనా బ్రహ్మపుత్ర ఉపనదిని అడ్డుకోవడం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చినట్లుగా నిర్దారించారు.
ఇటీవల చైనా టిబెట్‌లోని మెడోగ్ కౌంటీలో బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ఆనకట్టను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2024 డిసెంబర్ 25న అధికారికంగా ఆమోదం పొందింది . 300 బిలియన్ కిలోవాట్-అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసేలా నిర్మిస్తున్నారు. భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర మరియు , ఉపనదులపై జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. చైనా నీటి ప్రవాహాన్ని తగ్గిస్తే, ఈ ప్రాజెక్టుల సామర్థ్యం దెబ్బతినవచ్చు, చైనా నిర్మించనున్న ఆనకట్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. చైనా, భారత్ మధ్య ఆ ప్రాంతంపై వివాదం ఉంది.
సింధూ నది జలాలను ఆపేయడానికి ప్రతీకారంగా చైనాతో కలిసి పాకిస్తాన్ బ్రహ్మపుత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. భారత్ కు సమస్యలు వస్తాయి. కానీ చైనా దాన్ని ఇప్పటికే వీలైనంత వరకూ అడ్డుకుంటోంది. పైగా అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనికి కారణం భారత్ 2006 నుండి ఎక్స్‌పర్ట్ లెవెల్ మెకానిజం (ELM) ద్వారా చైనాతో హైడ్రోలాజికల్ డేటా షేరింగ్‌పై చర్చలు జరుపుతోంది. ఒప్పందం లేకపోవడం ఒక సవాలుగా మారింది. ఒక వేళ చైనా బ్రహ్మపుత్రపై ఏ కుట్రలు చేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచినట్లుగా అవుతుందన్న వాదన వినిపిస్తోంది.