Pakistan Ex-Army Chief:
వైరల్ వీడియో
పాకిస్థాన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్ట్‌లు సంచలన విషయాలు చెప్పారు. పాక్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. భారత్‌తో యుద్ధం చేసేంత సత్తా పాకిస్థాన్‌కు లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న సైన్యం, యుద్ధ ట్యాంకులతో భారత్‌తో పోరాడటం చాలా కష్టమని అన్నారు కమర్ జావేద్. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 25 మంది జర్నలిస్ట్‌ల ముందే ఈ వ్యాఖ్యలు చేశారని జర్నలిస్ట్‌లు చెబుతున్నారు. "భారత్‌తో యుద్ధం చేసే సామర్థ్యం పాకిస్థాన్ సైన్యానికి లేదు" అని ఆయన చెప్పినట్టుగా వెల్లడించారు.
"యుద్ధ ట్యాంకులు కండీషన్‌లో లేవని కమర్ జావేద్ బజ్వా మాతో చెప్పారు. కనీసం సైన్యాన్ని ఓ చోట నుంచి మరో చోటకు తరలించాలన్నా వాహనాలకు సరిపడా డీజిల్ అందుబాటులో లేదు. దాదాపు 20-25 మంది జర్నలిస్ట్‌ల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు"
- పాక్ జర్నలిస్ట్‌లు
కీలక ఒప్పందం.. !
ఇదే వీడియోని ట్విటర్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది వైరల్ అవుతోంది. అయితే అటు కశ్మీర్ విషయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కశ్మీర్ అంశంలో భారత్-పాక్ మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ఓ కీలక ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు వచ్చాయి. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న కమర్ జావేద్ ఇందులో ముఖ్యపాత్ర పోషించారనీ ఓ వీడియో వైరల్ అయింది. అంతే కాదు. కాల్పుల విరమణకూ చొరవ చూపారని అందుకే ఆయనకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపించింది. 2016-22 మధ్య కాలంలో పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కమర్. 2021 ఫిబ్రవరిలో మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల మధ్య భేటీ జరిగింది. LAC వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏమీ రాకుండా చూసుకుంటామని రెండు దేశాలూ అంగీకరించాయి. ఇక మరో కీలక విషయం ఏంటంటే..2021లో ఈ ఒప్పందం కుదిరిన తరవాత ప్రధాని నరేంద్ర మోదీ పాక్‌లో పర్యటించాలని అనుకున్నారట. అంతే కాదు. భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో బజ్వా రహస్య మంతనాలూ జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు కానీ, ఆధారాలు కానీ లేవు.