Plot to Kill Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు కుట్ర చేసిన పాకిస్థానీని పోలీసులు అరెస్ట్ చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ట్రంప్‌ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ వాళ్ల హిట్‌లిస్ట్‌లో ఆయన ఉన్నారని పరోక్షంగా చెప్పారు. ట్రంప్‌తో పాటు మరి కొందరు అమెరికా నేతల హత్యకూ ప్లాన్ చేసినట్టు తేలింది. నిందితుడికి ఇరాన్‌తో సంబంధాలున్నట్టు గుర్తించారు. 2020లో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరానియన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సొలేమనిని మట్టుబెట్టాలని ఆదేశించారు. బాగ్దాద్‌లో ఖాసిమ్‌ని మట్టుబెట్టారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌తో మరి కొందరు నేతల్నీ హత్య చేసేందుకు కుట్ర చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుడి పేరు అసిఫ్ రజా మర్చంట్‌గా గుర్తించారు. ట్రంప్‌ ఇంట్లో చోరీ చేయడంతో పాటు ఎన్నికల ర్యాలీల్లో అలజడి సృష్టించి ట్రంప్‌ని చంపేందుకు కుట్ర చేసినట్టు తేలింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ముఖ్యమైన డాక్యుమెంట్‌లు చోరీ చేయడం, ఆ తరవాత హత్య చేయడం..ఇలా ప్లాన్ చేశాడు నిందితుడు. వీటన్నింటికీ ప్రత్యేకంగా కోడ్‌లు కూడా పెట్టుకున్నాడు. 


ఈ మధ్యే ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. జులై 13 పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగా ట్రంప్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన కుడి చెవికి గాయమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే..అంతకు ముందు జరిగిన హత్యాయత్నానికి అసిఫ్ రజా మర్చంట్‌కి ఎలాంటి సంబంధం లేదని FBI అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి అమెరికాకి ఏప్రిల్‌లోనే వచ్చిన అసిఫ్ రజా అప్పటి నుంచి రెక్కీ చేస్తున్నాడు. అయితే..తనకు సాయం చేస్తారనుకున్న వాళ్లంతా స్పందించకపోవడం వల్ల అక్కడి నుంచి ఇరాన్‌కి బయల్దేరాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే..అమెరికా నుంచి తాను వెళ్లిపోయిన తరవాత అక్కడ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. అంతే కాదు. ట్రంప్‌ని చంపేందుకు 5 వేల అమెరికా డాలర్ల సుపారీ అందినట్టు చెప్పాడు నిందితుడు. 


Also Read: Bangladesh: షేక్ హసీనాకి భారత్ ఎందుకు ఆశ్రయమివ్వడం లేదు? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది?