Oxford debate Indian student Viraansh Bhanushali : ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనియన్ వేదికగా భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన చర్చా పోరులో ముంబైకి చెందిన భారతీయ విద్యార్థి విరాన్ష్ భానుషాలి (Viraansh Bhanushali) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. భారత్-పాక్ విధానం కేవలం రాజకీయ వ్యూహమేనా? అనే అంశంపై జరిగిన ఈ డిబేట్‌లో విరాన్ష్ తన వాదనలతో ప్రత్యర్థులను అడ్డుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చర్చా కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ విద్యార్థి మూసా హర్రాజ్ భారత ప్రధాని మోదీని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ తన అంతర్గత రాజకీయాల కోసమే పాకిస్థాన్‌ను విమర్శిస్తుందని ఆయన వాదించారు. విరాన్ష్ దీనిని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా, మూసా హర్రాజ్ ప్రసంగాన్ని కూడా తానే రాశానని బాంబు పేల్చడం పెద్ద చర్చకు దారితీసింది. విరాన్ష్ తన ప్రసంగం ప్రారంభంలోనే ఒక వ్యంగ్యమైన కామెంట్ చేశారు. మూసా నాకు ప్రాణ స్నేహితుడు, అతని చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నిన్న రాత్రి అతని ప్రసంగాన్ని నేనే రాశాను. ఒక పాకిస్థానీ అశక్తతను సరిచేయడానికి ఒక భారతీయుడు రావాల్సి ఉంటుందని ఒప్పుకుంటున్నాను అని అనడంతో సభలో నవ్వులు పూశాయి. దీని ద్వారా ప్రత్యర్థి దేశం యొక్క వాదనల్లో పస లేదని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.
భగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను సమర్థిస్తూ విరాన్ష్ చేసిన ప్రసంగం హైలైట్‌గా నిలిచింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శిస్తూ.. సిగ్గు లేని దేశాన్ని మీరు ఎప్పటికీ సిగ్గుపడేలా చేయలేరు అంటూ ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. తాను ముంబై వాసిని కావడంతో 26/11 దాడుల భయానక పరిస్థితులను కళ్లారా చూశానని విరాన్ష్ గుర్తుచేసుకున్నారు. ఆ దాడుల్లో తన మేనత్త తృటిలో ప్రాణాలతో బయటపడిందని, అలాంటి దాడులు జరిగినప్పుడు భారత్ తీసుకునే భద్రతా పరమైన నిర్ణయాలు ప్రజలను కాపాడటానికే తప్ప, ఓట్ల కోసమో లేదా పాపులిజం కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు. విరాన్ష్, మూసా హర్రాజ్ ఇద్దరూ ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో కలిసి పనిచేస్తున్న స్నేహితులే. చర్చలో భాగంగా వారు ఘాటుగా విమర్శించుకున్నప్పటికీ, విరాన్ష్ మాటలు భారతీయుల మనసు గెలుచుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై భారత్ యొక్క భద్రతా విధానాన్ని మరియు పాక్ వైఖరిని ఎండగట్టిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.