International Yoga Day 2024:  ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. జూన్ 21న ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా ప్రజలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day 2024) రోజున ప్రధాని ఇక్కడకు రావడం కాశ్మీర్ లోయ మొత్తానికి  గర్వకారణమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. జమ్మూ కాశ్మీర్‌తో ప్రధానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే ఆయన శ్రీనగర్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారని ఎల్‌జీ  మనోజ్ సిన్హా చెప్పారు. కొన్ని నెలల్లో కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​లో ఎన్నికల జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరగనున్న సందర్భంలో ప్రధాని మోదీ యోగా దినోత్సవాన్ని శ్రీనగర్​లో జరుపుకోవడానికి ప్రాధాన్యత పెరిగింది.  


 యోగాకు అంతర్జాతీయ గుర్తింపు
పదేళ్లలో యోగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో గతేడాది 23 లక్షల మంది ప్రజలు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేసే వారి సంఖ్య పెరుగుతుంది. ఒత్తిడి లేని జీవితం కోసం ప్రజలు యోగా వైపు మొగ్గు చూపుతున్నారని ఎల్‌జీ  మనోజ్ సిన్హా తెలిపారు.  కాశ్మీర్ ప్రజలతో ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏంటో  ఈ ఏడాది మార్చిలో బక్షి స్టేడియంలో జరిగిన బహిరంగ సభ రుజువు చేసిందన్నారు. మూడు నెలల క్రితం ఆయన స్టేడియంలో ప్రసంగించినప్పుడు చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారని ఆయన చెప్పారు.  ప్రధాని మోదీ వివిధ మాధ్యమాల ద్వారా ఇక్కడి స్థానికులతో నిరంతరం టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు.


కశ్మీర్ కు పెరిగిన పర్యాటకులు
అమర్‌నాథ్ యాత్రకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మొహర్రం కూడా దగ్గరపడుతుండడంతో అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటామన్నారు.  గతేడాది జీ20 సదస్సు (G20 Summit) విజయవంతంగా నిర్వహించిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకుల రాక పెరిగిందన్నారు. గతంలో కంటే 2.5 శాతం మంది ఎక్కువ ప్రయాణికులు కశ్మీర్ ను సందర్శిస్తున్నారని ఎల్ జీ పేర్కొన్నారు. కాబట్టి ఈ ఈవెంట్‌ కు కూడా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  జీ20 సదస్సు తర్వాత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు కశ్మీర్‌కు వస్తున్నారని ఎల్‌జీ వెల్లడించారు. కశ్మీర్‌కు కచ్చితంగా ప్రపంచ గుర్తింపు వస్తుందని, ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదైన తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిందని సిన్హా అన్నారు.


రెడ్ జోన్ గా కశ్మీర్
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్ పర్యటనకు ముందు, జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం నగరాన్ని తాత్కాలిక 'రెడ్ జోన్'గా ప్రకటించారు. డ్రోన్ల ఆపరేషన్‌ను నిషేధించారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ గురువారం తొలిసారి శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా డ్రోన్‌ల ఆపరేషన్‌పై నిషేధం గురించి శ్రీనగర్ పోలీసులు 'X'లో పోస్ట్ చేశారు.  యోగా కార్యక్రమంలో ఆటగాళ్లతో సహా వందలాది మంది ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. పాల్గొనేవారిని షార్ట్‌లిస్ట్ చేశామ, వారికి వివిధ 'ఆసనాలలో' శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ '  స్వీయ, సమాజం కోసం యోగా' అని జమ్మూ కశ్మీర్ ఆయుష్‌ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్‌ తెలిపారు.