అఫ్ఘానిస్థాన్‌లో సంభవించిన భూకంపం అక్కడ మృత్యు విలయాన్ని తలపిస్తోంది. భూకంప తీవ్రత అధికంగా ఉన్న హెరాత్ ప్రావిన్స్‌లో ఎటు చూసినా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయి మట్టిదిబ్బలుగా మారిన ఇళ్లు, శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలు, ఆనవాళ్లు లేకుండా మారిన గ్రామాలతో పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. శిథిలాల కింద ఆత్మీయుల కోసం వెతుకుతున్న అక్కడి వారి రోదనలు మిన్నంటుతున్నాయి. తాలిబన్ల పాలనలో సరైన సహాయక చర్యలు కూడా అందక, శిథిలాలను స్వయంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. హెరాత్‌లో ప్రావిన్స్‌లో కొన్ని ఊళ్లకు ఊళ్లే నేలమట్టమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. ఇప్పటికి 2400 మంది మరణించినట్లు తాలిబన్లు వెల్లడించారు. వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య 2,445కు చేరిందని, రెండు వేల మందికి పైగా గాయపడ్డారని విపత్తు నిర్వహణ శాఖ అధికార ప్రతినిధి జనన్ సయీఖ్ వెల్లడించారు.
హెరాత్ ప్రావిన్స్‌లో ఎటు చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అక్కడ దాదాపు అన్ని ఆస్పత్రులు, సైనిక స్థావరాలు మృతదేహాలతో నిండిపోయినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా చాలా కష్టంగా మారింది. ఆస్ప్రత్రలన్నీ నిండిపోయి, ఆస్పత్రుల బయట కూడా పడకలు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. తాలిబన్ల పాలనలో సహాయక చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించి రెండు రోజులైతున్నా తగిన సహాయక చర్యలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. కొన్ని చోట్లకు అసలు సహాయక సిబ్బంది ఎవ్వరూ రాకపోవడంతో వారే స్వయంగా శిథిలాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆహారం, తాగునీరు, దుస్తులు, టెంట్లు వంటి అత్యవసర వస్తువులు పెద్ద మొత్తంలో రెస్యూ టీంకు అత్యవసరంగా అవసరమున్నాయని తాలిబన్లకు చెందిన అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. సహాయం అందించాలని కోరారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలకు చెందిన బృందాలు, అక్కడి మిలిటరీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
అఫ్ఘానిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం వరుసగా పలుమార్లు భూమి కంపించింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు వచ్చాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఈ భూకంపాలు సంభవించాయి. హెరాత్ ప్రాంతంలో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల దేశం అతలాకుతలమైంది. హెరాత్ నగరానికి వాయువ్యంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రధాన కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.మొదటి భూకంపం నిన్న 12.11pm సమయంలో సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు చేసింది. ఆ తర్వాత 12.19pm సమయానికి మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.6 గా నమోదైంది. 12.42pm సమయంలో 6.౩ తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇలా దాదాపు అక్కడ భూమి ఆరు సార్లు కంపించినట్లు వెల్లడించింది.
అప్ఘానిస్థాన్ తరచూ భూకంపాలకు గురవుతుంది. హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, ఇది యురేషియన్ భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంటుంది. గత సంవత్సరం జూన్ లో అఫ్ఘానిస్థాన్ లోని పక్తికా రాష్ట్రంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో ఏకంగా వెయ్యి మందికిపైగా ప్రజలు మృతిచెందారు. 10 వేలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.