Ayodhya Ram Mandir Opening: అటు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుండగానే సరిగ్గా వెయ్యి కిలోమీటర్ల దూరంలో మరో రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ఒడిశాలో సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. సరిగ్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిపిస్తున్న సమయంలోనే ఈ ఆలయమూ తెరుచుకుంది. నయాగర్‌లోని ఫతేగర్‌లో నిర్మించిన ఈ ఆలయంలో 73 అడుగుల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఆలయ ఎత్తు 165 అడుగులు. స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అచ్చం అక్కడ అయోధ్య వాతావరణమే కనిపించింది. అందరూ రామనామ స్మరణలో తరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ఆలయ నిర్మాణానికి (Fategarh Ram Temple) భారీ విరాళాలు అందించారు. ఆలయ నిర్మాణానికైన ఖర్చులో సగం విరాళాల ద్వారా వచ్చిందే. 2017లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఏడేళ్లుగా 150 మందికిపైగా కార్మికులు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఈ ఆలయ నిర్మాణంతో మరింత ఆకర్షణ పెరుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం. 


చారిత్రక ప్రాధాన్యత..


ఈ ఆలయానికి ఓ చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1912లో నబకళేబర సమయంలో జగన్నాథుడు, బాలభద్ర, సుభద్ర ప్రతిమలను చెక్కతో చెక్కారు. ఆ సమయంలో ఫతేగర్‌ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ఓ పవిత్రమైన చెట్టుని ఈ విగ్రహాలను చెక్కేందుకు అందించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి గుర్తుగానే ఏదైనా చేయాలని స్థానికులు భావించారు. కొందరు చొరవ తీసుకుని శ్రీరామ సేవా పరిషత్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని స్థానికులు గిరి గోవర్ధన్‌గా పిలుస్తారు. వర్షాలు పడక కరవు వచ్చినప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. అలా చేస్తే వర్షాలు పడతాయని బలంగా నమ్ముతారు. అందుకే ఇక్కడే రామాలయాన్ని నిర్మించారు. ఒడిశా నిర్మాణ శైలిలోనే దీన్ని పూర్తి చేశారు. కోణార్క్ ఆలయం ఎలా అయితే ఉందో అదే ఆలయాన్ని పోలేలా రామ మందిరాన్ని కట్టారు.