Operationa Hidma: కోటి రూపాయలు అక్షరాలా కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిజానికి ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం ప్రకటించడం ఇదే తొలిసారి. అది కూడా ఒక మావోయిస్టు(Maoist)ను పట్టుకునేందుకు ప్రకటించడం గమనార్హం. ఆయనే ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సహా పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తు న్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, నటోరియస్ క్రిమినల్‌గా ఛత్తీస్‌గఢ్ పోలీసుల రికార్డుల్లో ఉన్న హిడ్మా(Madvi Hidma). ఈయనను బంధించేందుకు కేంద్ర బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా మారుమూల అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఉండే హిడ్మా ఇంటిని చుట్టుముట్టి ఆ గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే `ఆపరేషన్ హిడ్మా`కు శ్రీకారం చుట్టారు. కానీ, ఎంత ప్రయత్నించినా.. హిడ్మా ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ప్రజలకు కేంద్ర బలగాలు రూ.కోటి నజరానా ప్రకటించడం గమనార్హం.
ఎక్కడ నుంచి ఎక్కడి వరకు?
మావోయిస్టు హిడ్మా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి. సుమారు పాతిక సంవత్సరాల కిందటే ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 15 భాషల్లో అనర్గళంగా మాట్లాడే.. హిడ్మా.. సుక్మా జిల్లా పూవర్తి గ్రామాని(Poovarthi)కి చెందిన వ్యక్తి. దీంతో కొన్ని రోజుల కిందట ఈ గ్రామాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు.. ఇక్కడ నుంచే హిడ్మాను బంధించేందుకు పావులు కదుపుతున్నాయి. దక్షిణ బస్తర్‌లోని దండకారణ్యం మావోయిస్టులకు కంచుకోటగా ఉంది. పోలీసులు కూంబింగ్ చేపట్టినా.. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినా.. వాటిని ఎదుర్కొనేందుకు ఇంతకాలం మావోయిస్టులకు కంచుకోటగా వ్యూహాత్మక గ్రామంగా పూవర్తి ఉండేది. మావోయిస్టు పార్టీ బలోపేతమైంది కూడా ఇక్కడి నుంచేనని బలగాలు భావిస్తున్నాయి.
2021లో తెర్రాం వద్ద 28 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను వ్యూహాత్మకంగా చంపేయడానికి హిడ్కా స్కెచ్ వేసిం ది కూడా పూవర్తి నుంచేనని అధికారుల రికార్డుల్లో ఉంది. దీంతో మావోయిస్టుల వ్యూహాత్మక ప్రాంతంలో పాగా వేయాలని సీఆర్పీఎఫ్ నిర్ణయించింది. ఇప్పుడు హెడ్మా గ్రామంలో సీఆర్పీఎఫ్ 15 క్యాంపును ఏర్పాటు చేసింది. పూవర్తిని తమ ఆధీనంలోకి తీసుకుంది. హిడ్మా ఇల్లు, గెస్ట్ హౌస్‌లను కూడా స్వాధీనం చేసుకుంది. గతంలో పోలీ సులను మట్టుబెట్టేందుకు హిడ్మా వ్యూహ రచనలు చేసిన ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పూర్తిస్థాయిలో పాగా వేసింది. ఆపరేషన్ హిడ్మాకు ఇప్పుడు పూవర్తి కేంద్రంగామారడం గమనార్హం.
భారీ ఎత్తున బలగాలు..!
'ఆపరేషన్ హిడ్మా'కు సీఆర్పీఎఫ్ 5 కంపెనీల బలగాలను నియమించింది. ఒక్కో కంపెనీలో సుమారు 200 మంది జవాన్లు, కనీసం ముగ్గురు హెడా కాని స్టేబుళ్లు, ఇద్దరేసి ఏఆర్ఎస్సై, ఆర్ఎస్సైలు, ఒక ఆర్ఎస్ఐ స్థాయి అధికారి ఉంటారు. ఈ ఐదు కంపెనీలు ఇప్పుడు పూవర్తి సమీపంలోని అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. నైట్ విజన్ బెనాక్యూలర్లు, డ్రోన్లు, అదునాతన ఆయుధాలతో దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గిరిజన ఆదివాసీలు హడలి పోతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలోనే హిడ్మా ఉన్నాడని బలగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. అందుకే దండకారణ్యంలోని సుమారు 200 గిరిజన తండాల్లో హిడ్మాను పట్టించిన వారికి కోటి రూపాయల నగదు బహుమానం అందిస్తామని, వివరాలు చెప్పిన వారుపేరు, ఊరు వంటివి అత్యంత గోప్యంగా ఉంచుతామని డప్పు వేయిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పత్రికల్లోనూ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. మరి ఈ ప్రకటనకు రెస్పాన్స్ వస్తుందో రాదో చూడాలి.