Zaouli Dance: 


జవోలి డ్యాన్స్ 


ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ విన్నా "నాటు నాటు" పాట గురించే మాట్లాడుకుంటున్నారు. గ్లోబల్ అవార్డు రాకముందే ప్రపంచమంతా ఈ పాట మారుమోగింది. ఎంతో మంది ఈ సాంగ్‌లోని స్టెప్స్‌ని రీక్రియేట్ చేశారు. అవి కూడా వైరల్ అయ్యాయి. సినిమా విడుదల కాకముందే సంచలనం సృష్టించింది ఈ పాట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు బద్దలు కొట్టింది. తారక్, చరణ్ స్టెప్స్ చూసి ప్రపంచమంతా మెస్మరైజ్ అయింది. హుక్ స్టెప్స్‌ కి ఫిదా అయింది. ఈ డ్యాన్స్ చేసే టైమ్‌లో ఎంత కష్టపడ్డారో చాలా ఇంటర్వ్యూల్లో చరణ్, తారక్ చెప్పారు. అయితే...అంతకు మించి కష్టపడాల్సిన డ్యాన్స్ మరోటి ఉంది. దాని పేరే జవోలి (Zaouli). పశ్చిమాఫ్రికాలోని సెంట్రల్ ఐవరీ కోస్ట్‌లో నివసించే గురో (Guro) తెగ ప్రజలకు చెందిందే ఈ సంప్రదాయ నృత్యం. వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే మీ కళ్లను మీరే నమ్మలేరు. కేవలం రెండు కాళ్లను కదుపుతూ ఎక్కడా ఆగకుండా, కో ఆర్డినేషన్ తప్పకుండా డ్యాన్స్ చేసే తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే...సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి జవోలి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అది చూసి నెటిజన్లు వావ్ అనడమే కాదు... హ్యాట్సాఫ్ కూడా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతి కష్టమైన డ్యాన్స్ ఇదేనంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 20 లక్షల మంది చూశారు. 45 వేల మంది లైక్ చేశారు. ఇక షేర్‌లు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 






ఈ డ్యాన్స్ స్పెషల్ ఏంటి..? 


ఈ డ్యాన్స్‌లో స్పెషల్ ఏంటో తెలుసా..? జస్ట్ కాళ్లు మాత్రం కదపాలి. అది కూడా చాలా వేగంగా. కాస్త తేడా వచ్చినా కింద పడిపోవడమే. ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాస్క్ తప్పకుండా ధరించాల్సిందే. ఈ డ్యాన్స్‌లో ఆరితేరడం అంత సులభం కూడా కాదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా..? పాప్ రారాజు మైకేల్ జాక్సన్ కొన్ని స్టెప్స్‌కి ఈ డ్యాన్సే ఇన్‌స్పిరేషన్ అంటారు. జవోలి నృత్యం చూసి ఆయన కొన్ని చోట్ల ఆ డ్యాన్స్‌ను అనుకరించే ప్రయత్నం చేశారట. డ్యాన్సర్‌ వెనకాలే ఓ డ్రమ్మర్ ఫాలో అవుతుంటాడు. ఆ బీట్‌కి తగ్గట్టుగా...చాలా స్పీడ్‌గా కదులుతుంటాడు డ్యాన్సర్. ఈ నృత్యంలో కేవలం కాళ్లు మాత్రమే కదుల్తాయి. పైభాగం అంతా స్టెడీగానే ఉంటుంది. అంతే కాదు. ఓసారి వేసిన స్టెప్ మరోసారి వేయకూడదు. అంటే రిపీట్ అవ్వకూడదన్నమాట. చెబుతుంటేనే కష్టంగా ఉంది కదా. మరి ఆ డ్యాన్స్ చేసే వాళ్లకెలా ఉండాలి..? వీళ్లు పెట్టకునే మాస్క్‌కి కూడా స్పెషాల్టీ ఉంది. మహిళల గొప్పదనానికే కాకుండా వారి అందానికీ ఇది ప్రతీక అని ఆ తెగ వాళ్లు
విశ్వసిస్తారు. దాదాపు 6 రోజుల పాటు కష్టపడి ఈ మాస్క్ తయారు చేసుకుంటారు. అయితే...ఇది ఎలా తయారు చేస్తారన్నది మాత్రం ఇప్పటికీ రహస్యమే. ఓ సారి ఈ మాస్క్ పెట్టుకుంటే ఆ వ్యక్తి కేవలం "మనిషి" మాత్రమే కాదని, ఓ మానవాతీత శక్తిగా మారి వేగంగా కదులుతారని బలంగా నమ్ముతారు. అందుకే...దీన్ని కేవలం నృత్యంగానే కాకుండా వాళ్ల ఉనికిగానూ చూస్తారు గురో తెగ ప్రజలు. 



Also Read: Rapido Bike Taxi: ర్యాపిడోకి షాక్ ఇచ్చిన కోర్టు, సర్వీస్‌లు నిలిపివేయాలంటూ ఆదేశాలు