Wayanad Landslides News Today: వయనాడ్ విధ్వంసం 370 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వందలాది మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులతో పాటు పోలీసులు, ఇండియన్ ఆర్మీ, NDRF సిబ్బంది అన్ని విధాలుగా బాధితులకు సహాయం అందిస్తున్నారు. మందక్కై,చూరల్‌మల ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రాణనష్టమూ ఇక్కడే ఎక్కువగా నమోదైంది. రెస్క్యూ టీమ్స్ వీలైనంత వరకూ సరైన సమయానికే (Wayanad Rescue Operation) వెళ్లి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే...వాతావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్ల వల్ల కొన్ని చోట్ల రెస్క్యూ ఆలస్యమవుతోంది. ఈ కారణంగా కొంత మంది సాయం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వయనాడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో స్టాఫ్ మెంబర్‌గా పని చేస్తున్న ఓ మహిళ ఇలానే చనిపోయింది.
ముఖ్యమైన విషయం ఏంటంటే...వయనాడ్‌లో ఈ విధ్వంసం మొదలైనప్పుడు మొట్టమొదట అత్యవసర సేవల్ని అలెర్ట్ చేసింది ఈ మహిళే. పేరు నీతూ జోజో. రెస్క్యూ టీమ్ ఆమెని చేరుకుని సాయం అందించేలోగానే మృతి చెందింది. అప్పటికీ ఎమర్జెన్సీ టీమ్‌కి కాల్ చేసి మాట్లాడింది నీతూ. తనతో పాటు మరి కొన్ని కుటుంబాలు ఇలానే చిక్కుకుపోయాయని, సాయం అందించాలని కోరింది. ఈ బాధితులంతా నీతూ ఇంట్లోనే ఉన్నారు. చూరల్‌మలలో కొండచరియలు విరిగి పడగానే వెంటనే వాళ్లంతా నీతో ఇంట్లో తలదాచుకునేందుకు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే చిక్కుకుపోయారు
ఇంట్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయని, చుట్టూ శిథిలాలున్నాయని ఎమర్జెన్సీ టీమ్‌కి కాల్ చేసి చెప్పింది బాధితురాలు. కొన్ని చోట్ల కార్లు కూడా కొట్టుకుపోయాయని అంత ఉద్ధృతంగా ప్రవాహం ఉందని వివరించింది. తన ఇంట్లో దాదాపు ఐదారు కుటుంబాలున్నాయని, సాయం చేయాలని కోరింది. ఎమర్జెన్సీ టీమ్‌తో పాటు తను పని చేస్తున్న హాస్పిటల్ డాక్టర్‌లకీ కాల్ చేసింది నీతూ జోజో. "ఆమె మాకు కాల్ చేసినప్పుడు గొంతు చాలా దీనంగా వినిపించింది సాయం కోసం వేడుకుంది. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. చూరల్‌మలకి ఓ ఆంబులెన్స్ కూడా పంపించాం. చెట్లు కూలిపోవడం వల్ల ఆంబులెన్స్ అటుగా వెళ్లలేకపోయింది. అప్పటికీ మా డ్రైవర్ ఆమెతో మాట్లాడాడు. కానీ రెండోసారి కొండ చరియలు విరిగి పడిన తరవాత కాల్ కలవలేదు. ఆమెని కాపాడలేకపోయాం. రెండు రోజుల తరవాత ఆమె మృతదేహం కనిపించింది" అని ఓ డాక్టర్ వివరించారు.
తప్పించుకోడానికీ ఏ దారీ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. ఇక ఆ హాస్పిటల్‌లో మరో నలుగురు ఉద్యోగులూ చనిపోయారు. నీతూ ఒక్కరే కాదు. రెస్క్యూ టీమ్స్ చేరుకోడానికి వీల్లేని ప్రాంతాల్లో ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాపాడాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఓ ఆటంకం వాళ్లను అడ్డుకుంటోంది. చాలా చోట్ల వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్ కనెక్షన్ లేకుండా పోయింది. అప్పటికప్పుడు తాత్కాలికంగా వంతెనలు నిర్మించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్.
Also Read: World News: మహాత్మాగాంధీ నుంచి మలాలా వరకు ప్రపంచ గతిని మార్చిన లేఖలు