Kashmir Omar Abdullah : ముఖ్యమంత్రిని బలగాలు అడ్డుకోవడం అనేది ఎక్కడా జరగదు. కానీ కశ్మీర్ లో మాత్రం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని అమరవీరులకు నివాళులు అర్పించకుండా బలగాలు అడ్డుకోవడం వివాదాస్పదం అయింది.  జులై 13న కాశ్మీర్‌లో మార్టిర్స్ డే గా జరుపుకుంటారు. 1931 జులై 13న డోగ్రా రాజవంశం దళాలు .. కాశ్మీరీ నిరసనకారులకు  మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయిన  వారికి నివాళులు అర్పించేందుకు ఒమర్ అబ్దుల్లా వెళ్లారు.     ఈ సంఘటనను కాశ్మీర్‌లోని చాలా మంది జలియన్‌వాలా బాగ్‌తో పోల్చుతారు. ఇది బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్న డోగ్రా రాజవంశానికి వ్యతిరేకంగా నిరసనలకు ప్రతీకగా  భావిస్తారు. 

ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత, జులై 13న మార్టిర్స్ డే సెలవుదినం 2020లో అధికారిక సెలవుదినాల జాబితా నుండి తొలగించారు. కానీ వాటిని పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు. బలగాలు  ఒమర్ అబ్దుల్లాతో సహా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు , ఇతర ప్రతిపక్ష నాయకులు మార్టిర్స్ గ్రేవ్‌యార్డ్‌ను సందర్శించకుండా ఆపేశారు.  ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన ఇంటిలో  "హౌస్ అరెస్ట్ "లో ఉంచారని ఆరోపించారు.  "ఎన్నిక కాని ప్రభుత్వం  నిరంకుశత్వం"గా విమర్శించారు.

జమ్మూ కాశ్మీర్ పోలీసులు అమరవీరుల సమాధులున్న ప్రాంతాన్ని మూసివేశారు. ఒక రోజు ఆలస్యమైనా సరే నివాళులు అర్పించాలని   జులై 14న  ఒమర్ అబ్దుల్లా తన తండ్రి  ఫరూక్ అబ్దుల్లా, డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి, సలహాదారు నసీర్ అస్లామ్ వానీతో కలిసి శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలోని మజార్-ఎ-షుహాదా వద్ద నివాళులర్పించేందుకు వెళ్ళారు.   భద్రతా బలగాలు ఒమర్ అబ్దుల్లాను మరియు  NC నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశాయి, దీనివల్ల ఒమర్ గోడ దూకి గ్రేవ్‌యార్డ్‌లోకి ప్రవేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన Xలో పోస్ట్ చేశారు. 

ఒమర్ అబ్దుల్లా తన కారును నౌహట్టా చౌక్ వద్ద ఆపి, నడిచి వెళ్ళారు.  నక్షబంద్ సాహిబ్ ఆలయ గేట్‌ను బ్లాక్ చేయడంతో గోడ దూకవలసి వచ్చింది. తనను హౌస్ అరెస్టు చేసిన విషయాన్ని మీడియా కూడా వెల్లడించలేదని ఒమర్ అబ్దుల్లా విమర్శిస్తున్నారు.