Goa Governor Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమించారు . ప్రస్తుతం గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లై ఉన్నారు. ఆయన స్థానంలో  అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించారు. 

Continues below advertisement



ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించారు.  7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.  2014-2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో వాణిజ్య పన్నులు, ఆబకారీ, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు.    - విజయనగరం రాజవంశం చివరి మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు కుమారుడు.  సింహాచలం ఆలయం, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వంటి సంస్థల ద్వారా దానధర్మాలకు ప్రసిద్ధి. చెందారు. 


ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక మిత్రపక్షంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంతో పాటు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో తమ పార్టీలో అత్యంత సీనియర్ నేత, క్లీన్ ఇమేజ్ ఉన్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించాలని చంద్రబాబునాయుడు బీజేపీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. అశోక్ గజపతిరాజుపై ప్రధాని మోదీకి కూడా మంచి అభిమానం ఉంది.  నాలుగేళ్ల పాటు కేంద్ర విమానయాన మంత్రిగా చేశారు. రాజకీయాల్లో అంత సింపుల్‌గా.. నిజాయితీగా ఉండే నేతలు అరుదని ప్రధాని మోదీ భావిస్తూ ఉంటారు. 





వయసు పెరగడంతో పాటు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కుమార్తెకు అవకాశం కల్పించడంతో గత సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పల్నాయుడు పోటీ చేస్తే మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కుమార్తె అదితి గపతిరాజు విజయం సాధించారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బీజేపీ అధినాయకత్వం.. కొంత మంది తటస్థులకు గవర్నర్ పదవులు ఇస్తుంది కానీ ఇతర పార్టీల వారికి..ఎంత మిత్రపక్షాలు అయినా..  గవర్నర్ గా పదవి కేటాయించడం  చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు ప్రయత్నాలు, అశోక్ గజపతి రాజు క్లీన్ ఇమేజ్ తో ఈ పదవి వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రం నుంచి కంభంపాటి హరిబాబు గవర్నర్ గా ఉన్నారు.